గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన పల్లెలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడగా, పాలన పడకేసింది. ప్రత్యేకాధి కారుల పర్యవేక్షణ కొరవడడం, నిర్వహణ లోపంతో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు వెలవెలబోతు న్నాయి. వైకుంఠ ధామాలు పిచ్చి మొక్కలతో నిండిపోయి మందుబాబులకు అడ్డాగా మారగా, రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయి.
ఇటీవలె నాలుగు పథకాలు అమలుచేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం మండలానికొక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. కొద్దిరోజుల క్రితం అర్భాటంగా పథకాల అర్హులను ప్రకటిం చి, ఇందులో కొద్దిమందికే ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ గ్రామాల్లోనూ పథకాలు అమలు కాక.. అభివృద్ధి జరగక ప్రజలు అవస్థపడుతున్నారు. ఈ క్రమంలో పైలట్ గ్రామాల్లో పరిస్థితిని సవివరంగా తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ రేగొండ మండలంలోని లింగాలలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. గ్రామస్తులు, లబ్ధిదారులతో ముచ్చటించింది. – జయశంకర్ భూపాలపల్లి, మార్చి 16 (నమస్తే తెలంగాణ)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో 12 పైలట్ గ్రామాలను ఎంపిక చేశారు. అందులో రామగుండాలపల్లి, టేకుమట్ల, ముచినిపర్తి, అంకుశాపురం, లింగాల, బుర్రకాయలగూడెం, రాంపూర్, ధన్వాడ, మాదారం, నాచారం, ఎల్కేశ్వరం, పంకెన గ్రామాలున్నాయి. వీటిలో గ్రామ సభలు నిర్వహించి నాలుగు పథకాలకు అర్హులను గుర్తించి అందులో కొద్దిమందికే ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇందులో అధిక శాతం కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
పైలట్ గ్రామాల్లో మొత్తం 12,623 మంది జనాభా ఉండగా గతంలో 7,129 మంది రైతుబంధు పొందారు. ఇప్పుడు 6,699 మందికి రైతు భరోసా వస్తున్నది. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 980 దరఖాస్తులు రాగా 536 మందిని అర్హులుగా ఎంపిక చేసి 446 మందిని, ఆత్మీయ భరోసాకు 703 అర్జీలు వస్తే 342 మందిని అర్హులుగా గుర్తించి 333, ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,724 దరఖాస్తులు రాగా 1,533 మందిని అర్హుల జాబితాలో చేర్చి 956 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు.ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి నిబంధనలు అడ్డొస్తుండడంతో చాలా మంది నిర్మాణం చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీలేదని పైలట్ గ్రామాల ప్రజలు అంటున్నారు.
రేగొండ మండలంలోని పైలట్ గ్రామమైన లింగాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అభివృద్ధే దర్శనమిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క సీసీ రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారే తప్ప మిగతా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మరో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. గ్రామంలో 1,355 మంది జనాభా ఉండగా, గతంలో 795 మంది రైతులు రైతుబంధు సాయం పొందారు. ప్రస్తుతం 741 మందికి రైతు భరోసా అందింది.
కొత్త రేషన్ కార్డులకు 150 దరఖాస్తులు రాగా 57 మందిని అర్హులుగా ప్రకటించి 23 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆత్మీయ భరోసాకు 180 మంది దరఖాస్తు చేసుకుంటే 28 మందిని ఎంపిక చేసి ముగ్గురికే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం 431 మంది అర్జీ పెట్టుకోగా 214 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో కేవలం 70 మందికే ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్లను 400 స్కేర్ ఫీట్లలోనే నిర్మించుకోవాలనే ప్రభుత్వ నిబంధన అవరోధంగా మారిందని, ఇంత తక్కువ స్థలంలో ఇల్లు ఎలా నిర్మించుకుంటామని, నివాసం ఉండడానికి, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఎలా సరిపోతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామం నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అక్కడే ఉన్న చేతి పంపు చెడిపోయింది. అలా గే గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో చెట్లు ఎం డిపోయి చిత్తడిగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జీపీ భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను గత ప్రభుత్వం అభివృద్ధి చేయగా, నేడు ఆవరణంతా అస్తవ్యస్థంగా మారింది. పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో నర్సరీ ఏర్పాటు చేశారు.
నాకు మూడెకరాల భూమి ఉంది. పంట రు ణం తీసుకున్న. వడ్డీతో కలిపి రూ.2 లక్షలకు పై గా అయింది. నాకు రుణమాఫీ జరగలేదు. కాంగ్రె స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు, వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం పనులు జరిగాయి. గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలను అందంగా మార్చా రు. పథకాలన్నింటికీ దరఖాస్తులు తీసుకున్నారు తప్ప ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. 400 స్కేర్ ఫీట్లలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలంటున్నది. ముగ్గు కొంచెం ఎక్కువ పోస్తే బిల్లు రాదట. దీంతో చాలా
మంది నిర్మాణానికి వెనుకాడుతున్నరు.
– సామల లక్ష్మణ్, రైతు,లింగాల రేగొండ మండలం