హనుమకొండ, మే 30 : పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయు ల పెన్షనర్ల బకాయి జీపీఎఫ్ 100శాతం అందరికీ, కమ్యుటేషన్ మే 2025 వరకు చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని టీఎన్జీవోస్ భవన్లో టీ రఘువీరు అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాం గ్రెస్ సర్కార్ 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 100 రోజుల్లో రూ.6వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఏ ఒకరికి చెల్లించలేదన్నారు.
కమ్యుటేషన్ కూడా మే 2025 వరకు చెల్లించామని ప్రకటించారని, కానీ కొందరికి మాత్రమే అందజేశారని, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు ప్రకటనలతో పెన్షనర్లను మోసం చేస్తుందని, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జీపీఎఫ్, కమ్యుటేషన్ ఎవరెవరికి చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు విడతల వారీగా కాకుండా ఏక మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్మెంట్ బకాయిలు అందక జరుగుతున్న మరణాలను ఆపాలని కోరారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి నగదు రహిత హెల్త్ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, నేటికీ విధివిధానాలు రూపొందించలేదని, హెల్త్ కార్డుల పర్యవేక్షణకు ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో పెన్షనర్ల నుంచి ఆరుగురిని సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల నుంచి 1.5శాతం చొప్పున వసూలు చేస్తున్న మొత్తం ఎంత అవుతుందో అంతే మొత్తం సర్కారు ఆ ట్రస్టులో జమ చేయాలని, వాటిని ఇతర పథకాలకు మళ్లించవద్దన్నారు. ప్రభుత్వం నేటి వరకూ పీఆర్సీ రిపోర్టు కూడా సడ్మిట్ చేయకపోవడం శోచనీయమన్నారు.
జూన్ ఒకటిలోగా జడ్పీ జీపీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించకుంటే 2న రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లోని వివిధ జిల్లాలకు ఇన్చార్జిలను నియమించారు. భూపాలపల్లి జిల్లాకు పీ సంజీవరెడ్డి, హనుమకొండకు ఎం సంజీవరెడ్డి, ఏ సురేందర్, వరంగల్‌కు టీ రఘువీరు, ఎండీ మహబూబ్అలీ, మహబూబాబాద్‌కు జీ కిషన్, ఆర్వీ చలం, ఎస్ గోవర్ధన్, జనగామకు మిర్యాల రమేశ్, ములుగు జిల్లాకు మార్త పాపయ్యను నియమించారు. సమావేశంలో టీ రఘువీరు, ఏ సురేందర్, ఎం పాపయ్య, పెద్ది ఆంజనేయులు, కామేశ్వర్, జీ కామేశ్వర్, పీ సాంబయ్య, మీస రాజమల్లయ్య, డాక్టర్ బీ కృష్ణమూర్తి, సాల్మన్, ప్రభుదాస్, వేణుగోపాల్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.