కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట మరోసారి రైతులను వంచించింది. చివరి విడతలోనూ వేలాది మందికి మొండిచేయి చూపింది. చివరి జాబాతాలో తమ పేరుంటుందని ఆశపడిన అన్నదాతలను నిండా ముంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లోనూ 50 శాతం లోపు రైతులకే మాఫీ చేసిన సర్కారు నాలుగో విడతలోనూ మాయ చేసింది. అన్ని అర్హతలుండి మాఫీ కాక ఆందోళనకు దిగిన రైతుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వం ఇందులోనూ సగం మందికే అమలు చేసింది.
దీంతో రైతులు రాష్ట్ర సర్కారుపై మండిపడుతున్నారు. రుణమాఫీ పూర్తయ్యిందని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాలేదని తమ నుంచి అన్ని వివరాలు, సెల్ఫీలు తీసుకొని మాఫీ ఎగ్గొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి తమకెందుకు మాఫీ కాలేదంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
– హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 2
హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ అంతా మాయేనంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి, రెండు, మూడో విడతల్లో రుణమాఫీ జరగక వేలాది మంది అన్నదాతలకు నిరాశే ఎదురైంది. అనేక కారణాలతో మాఫీ నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన ప్రభుత్వం కుటుంబ గుర్తింపు, రేషన్ కార్డు, ఇతర కారణాల నివృత్తి కోసం ఆయా వ్యవసాయ క్లస్టర్లకు వెళ్లి ఏవోలతో సెల్ఫీలు దిగి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో వారంతా ఆయా క్లస్టర్ల వెళ్లి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది వివరాలు నమోదు చేసుకోలేకపోయారు.
దీనికి తోడు బ్యాంకు, ఆధార్‌లో పేర్లు తప్పుగా ఉన్న వారు సైతం తమ పూర్తి సమాచారాన్ని అధికారులకు అందజేశారు. పైగా అయితే వ్యవసాయాధికారుల తప్పిదమో, లేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో తప్పిదమో కానీ అనేక మంది రైతుల వివరాలు సాంకేతికంగా నమోదు కానట్లుగా తెలుస్తున్నది. ఈ కారణంగా 50 శాతం మంది రైతులకు కూడా మాఫీ జరగలేదని క్షేత్రస్థాయిలో వెల్లడవుతున్నది. పైగా రూ. 2 లక్షలకు పైనున్న డబ్బులు బ్యాంకులో జమచేస్తే మిగిలిన రుణాన్ని మాఫీ చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాటలు నమ్మిన రైతులు వాటిని చెల్లించారు.
వీరికి కూడా చివరి విడతలో మాఫీ కాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. హనుమకొండ జిల్లాలోని అన్ని క్లస్టర్లలోకలిపి 6,760 మంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకోగా అందులో సగం మందికి కూడా మాఫీ జరగనట్లు సమాచారం. అయితే ఈ విషయమై వ్యవసాయాధికారుల్లో కూడా గందరగోళం నెలకొంది. నిర్ధిష్టంగా ఇంత మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పలేకపోతున్నారు. దీంతో చివరి విడతలోనైనా తమ పేరుంటుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి తాము అన్ని వివరాలు సమర్పించినా ఎందుకు మాఫీ కాలేదని నిలదీస్తున్నారు. దొంగ హామీలిచ్చి తమను సీఎం రేవంత్‌రెడ్డి వంచించాడని, ఇంత నమ్మక ద్రోహాన్ని తామెప్పుడూ చూడలేదని ఆవేదన చెందుతున్న అన్నదాతలు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
చిట్యాల : నాకు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రూ.50వేల క్రాప్ లోన్ ఉంది. మొదటి విడతలో రుణమాఫీ కాలేదు. ఎందుకని అధికారుల దగ్గరికి పోతే బ్యాంకు, ఆధార్ కార్డులో పేర్లు వేరే ఉన్నాయని రుణమాఫీ ఆగినట్లు చెప్పిన్రు. రెండు, మూడో విడతల్లో కూడా డబ్బులు జమ కాలేదు. నాలుగో విడతలో అందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు.అయినా ఇంతవరకు డబ్బులు పడలే.
– కన్నవేణి రాయకొమురు, చిట్యాల
దామెర: నేను మా ఊరిలోని ఏపీజీవీ బ్యాంకులో రూ. లక్షా 95 వేల రుణం తీసుకున్న. ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేస్త్తమని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్న. ఎన్నికలకు ముందు రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తా మని హామీ ఇచ్చి ఏడాదవుతున్నా రుణమాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే మాకు తెలియదని దాటవేస్తున్నరు. డబ్బులు పడుతయని ఎదురుచూస్తున్న. ప్రభుత్వం వెంటనే రుణ మాఫీ చేసి ఆదుకోవాలి.
– ఒడిదోలు మల్లయ్య, రైతు, ఊరుగొండ, దామెర
భీమదేవరపల్లి: రుణమాఫీ ఇవ్వడానికి నాకు అర్హత లేదా.. లేక కావాలని ఇస్తలేరా.. నాకైతే అస్సలు అర్థమైత లేదు. నేను ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం లో సభ్యుడిని. నాకు 4.30 ఎకరాల వ్యవసా య భూమి ఉంది. పట్టాదారు పాసుబుక్కు, సంఘంలో పేరులో తప్పు దొర్లిందని రుణమాఫీ రాలేదు. దీంతో సవరించి పంపించా ను. రుణమాఫీ డబ్బులు వస్తే కాసింత అప్పు లు తీరుతాయి అని వేయి కళ్లతో ఎదురుసూత్తాన. తీరా జూత్తే ఇప్పుడు కూడా రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. ఎందుకని తెలుసుకుంటే నాకు పట్టాపాసు బుక్కు లేదని వచ్చింది. ఇదీ వీళ్ల రుణమాఫీ లీల.
– కాశిరెడ్డి ఆదిరెడ్డి, రైతు, ముత్తారం, భీమదేవరపల్లి
టేకుమట్ల: కాంగ్రెస్ ప్రభుత్వం రు ణమాఫీ చేయకుండా రైతులను ము ప్పుతిప్పలు పెడుతున్నది. బ్యాంకు లో లిస్టు తీసుకుని సక్కగ మాఫీ చేయకుండా అనేక కొర్రీలు పెడుతూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరం. నిరుపేద రైతులకు రుణమాఫీ చేయ కుండా, రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. పెళ్లిళ్లు జరిగి వేరు పడ్డా రైతులకు రేషన్ కార్డులు ఒకటే ఉన్నాయి. వారు వేర్వేరుగా తీసుకున్న అప్పులను తండ్రి కొడుకులవి కలిపి రూ. 2లక్షల పైన ఉన్నాయని సాకు చెప్పి మాఫీ చేయకపోవడం మాట తప్పడమే అవుతుంది. రైతులందరికీ వెంటనే రూ. 2లక్షల వరకు మాఫీ చేయాలి.
– కూర సురేందర్‌రెడ్డి, వెల్లంపల్లి, టేకుమట్ల
చెన్నారావుపేట: అధికారులు అడిగిన అ న్ని పత్రాలు ఇచ్చినా మాఫీ కాలేదంటున్రు. నేను తీసుకున్న అప్పు మొత్తం రూ. రెండు లక్షల లోపే ఉన్నది. సొసైటీ వాళ్లు చేసిన తప్పులకు రైతులను ఇబ్బంది పెడుతున్న రు. చెప్పినట్లు రైతులందరికీ మాఫీ చేయా లే గాని ఇలా తిరకాసులు పెట్టి ఆఫీసుల చు ట్టూ తిప్పుకునుడు మంచిగ లేదు. ఆధార్ తప్పు ఉన్నదని సరిచేస్తామని ఇన్ని రో జులు తిప్పిండ్లు. పానం బాగా లేకపోయినా మా పిలగాన్ని పట్టుకొని వాళ్లు అడిగిన పేపర్లు అన్ని ఇచ్చినం. అయినా మాఫీ కాలేదంటున్నరు. ఇప్పుడు అడిగి తే ఖాతాలు చెక్ చేయాలని చెబుతు న్నరు. అసలు వస్తుందా లేదా తెలియడం లేదు. మాలాంటి వాళ్లను మోసం చేయడం మంచిది కాదు.
– బోడ ఈరమ్మ, రైతు, చెన్నారావుపేట
సబర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తుందనే నమ్మకం పోయింది. నాకు రెం డు ఎకరాల 39 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కమలాపూర్ యూబీఐలో రూ. రెండు లక్షల క్రాప్‌లోన్ తీసుకున్న. నాలుగు విడతలు రుణమాఫీ చేసినా మాఫీ కాలేదు. రూ. రెండు లక్షలలోపు ఉంటేనే మా ఫీ వర్తిస్తుందని మంత్రులు, అధికారులు చెప్పడంతో కట్టిన. అయినప్పటికీ మాఫీ కాలేదు. నా తండ్రి గట్టుమల్లు పేరుతో రూ. లక్ష, కొడుకు సుమంత్ పేరుతో రూ. లక్ష క్రాప్‌లోన్ తీసుకున్న. ముగ్గురికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండగా ఒకరికే మాఫీ వస్తుందని అధికారులు చెప్పుతున్నరు. అయినప్పటికీ మా కుటుంబంలో ఎవరికీ మాఫీ కాలేదు. రుణమాఫీ రూ. 2లక్షలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. గత ప్రభుత్వంలో మాఫీ అయిన రైతులకే ఇప్పుడు మాఫీ అయింది.
– ఎల్లబోయిన సారయ్య, రైతు, దేశరాజ్‌పల్లి, కమలాపూర్
నేను మా ఊరి బ్యాంకులో పోయినేడు పంట పెట్టుబడి కోసం రూ. 25 వేలు అప్పుగా తీసుకున్న. మొన్న ఎన్నికలప్పుడు సర్కారు పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులను మాఫీ చేస్తామంటే మస్తు సంబురపడ్డ. రూ. 25 వేలు అప్పు పోయినట్టే అనుకున్న. నాకు బియ్యం కార్డులేదని మాఫీ కాలేదట. అటెంక ఎవుసం ఆఫీసుకు తీసుకుపోయి సార్లు ఫొటోలు తీసుకున్నరు. నీకు మాఫీ అయితది పో అని చెప్పిండ్లు. నిన్ననే కొందరికి మాఫీ అయ్యిందని చెబితే ఆధార్కారటు తీసుకునిపోయి ఏవో సార్ దగ్గర చూపెట్టిన. అచ్చినోల్లల్ల నీ పేరు లేదన్నరు. మళ్లొత్తే సూద్ద్దామని చెప్పి పంపించిండ్రు.
– కొన్నె కనుకమ్మ, మహిళా రైతు, ఎల్కతుర్తి