సుబేదారి/నర్సింహులపేట/చిట్యాల, మే 30 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో రాజీవ్ యువ వికాస పథకం ఒకటి. ఆరు గ్యారెంటీల్లో భాగం గా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ పథకంపై గొప్పగా ఉపన్యాసాలు దంచిన నాయకులు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. కానీ, ఇప్పటి వరకు ఈ పథకం కింద ఏ ఒక్క నిరుద్యోగికి ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.
ఈ పథకం ద్వా రా 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధికి రూ.50వేల యూనిట్‌కు 100 శాతం, రూ.లక్ష యూనిట్‌కు 90 శాతం, రూ.2 లక్షల యూనిట్ వరకు 80 శాతం, రూ.4లక్షల యూనిట్‌కు 70శాతం రాయితీ ఇస్తామని, అర్హులు 2025 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 14వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించలేదు. దీంతో రాజీవ్ యువ వికాసం ఉత్తుత్తి పథకమేనా? అని నిరుద్యోగులు వాపోతున్నారు.
‘పేరు గొప్ప తీరు దిబ్బ’ అన్నట్లుగా మొదట ఈ పథకంపై గొప్పగా ప్రచా రం చేసిన ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి దరఖాస్తు లు తీసుకున్న తర్వాత ఒక్క రుపాయి కూడా మంజూ రు చేయలేదు. ‘ఏడాది క్రితం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాం, కానీ, ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు’ అని ఆయా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపిందని ఎస్సీ, ఎస్ట్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం కాలంలో సగం గడిచిపోయింది. అయితే ఇంకెప్పుడు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తారు? అని నిరుద్యోగ యువత రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నిస్తున్నది.
రాజీవ్ యువవికాసం పథకంలో ఆటో కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న. అధికారులను అడిగితే పూర్తిస్థాయిలో సమాచారం లేదని అంటున్నరు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు రుణాలు మంజూరవుతాయా? కావా? అనే విషయంపై చెప్పేవారు లేరు. రాజీవ్ యువ వికాసంలో రుణాలు వస్తే ఆటో కొనుక్కొని కుటుంబ పోషణ చేసుకుందామనుకుంటే అది కూడా రాకపోయే.
– డొనికెన సోమన్న, కొమ్ములవంచ, నర్సింహులపేట మండలం
హనుమకొండ జిల్లాలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి ఎస్సీ యువత 13,060 మంది, ఎస్టీలు 6 వేలు, బీసీ లు 7,425, మైనార్టీలు 2,700 మంది గతఏడాది ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడాదిగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక చేయలేదని అధికారులు చెబుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ఈ పథకం కింద లబ్ధిపొందడానికి 49,234 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఎస్సీలు 8,963, ఎస్టీలు 18,808, బీసీలు 19,840, ఈడబ్ల్యూఎస్ మైనార్టీలు 1,063 మంది ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకానికి మొత్తం 21,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీసీలు 11,225 మంది, ఎస్సీలు 6,711, ఎస్టీలు 2,333, ఈబీసీలు 401, మైనార్టీలు 749, క్రిస్టియన్లు 9 మంది ఉన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని ఏడాది దాటింది. గత జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రుణం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఎదురుచూస్తున్న. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా నాకు ఉద్యోగం దొరకకపోవడంతో ప్రభు త్వ రుణంతో డీటీపీ, ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకుందామనుకున్న. నా కల కలలాగే మిగిలిపోయింది. నిరుద్యోగంతో బాధపడుతూ కుటుంబానికి భారంగా ఉంటున్న. ఇప్పటికైనా ప్రభుత్వం రుణం అందజేయాలి.
– తడవర్తి చైతన్య గుప్తా, వెంకట్రావుపల్లి, చిట్యాల మండలం