కాశీబుగ్గ, నవంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక.. కొన్నా గిట్టుబాటు ధర దక్కక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఆందోళన చెందుతున్నారు. సోమవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ మిల్లర్ల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ విధించిన కఠిన నిబంధనలకు నిరసనగా క్రయవిక్రయాలను బంద్ చేశారు. దీంతో ఆదివారం అర్ధరాత్రే పత్తిని మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకూ కాంటాలు కాకపోవడంతో మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పత్తియార్డును ముట్టడించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోగా మార్కెట్ కార్యదర్శి నిర్మలతో పాటు ఎనుమాముల ఇన్స్పెక్టర్ అల్లె రాఘవేందర్, ఎస్సై పోగుల శ్రీకాంత్ రైతులను శాంతింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఈ సమయంలో ఖరీదుదారులు రాక, కొనుగోళ్లు జరగక రైతులు పత్తి బస్తాలపైనే కునుకు తీశారు. కాంటాలు వేసే పరిస్థితి లేకపోవడంతో హమాలీలు, దడువాయిలు సైతం కాసేపు కాంటాలపైనే నిద్రపోయారు. నాలుగు గంటలపాటు వేచి చూశాక ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటి గంటకు జెండా పాట నిర్వహించడంతో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మార్కెట్కు సుమారు 600 పత్తి బస్తాలతో పాటు 30 వాహనాల్లో లూజు పత్తి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా క్వింటా పత్తి రూ. 6,960 ధర పలికింది.