హనుమకొండ, మే 1 : హనుమకొండలో ఈ నెల 6వ తేదీన నిర్వహించేది రైతుసభ కాదు.., రైతు ప్రతినిధుల సదస్సు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలిలో ప్రతిపక్షత నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు’ అనే నానుడి గుర్తు చేస్తూ రేవంత్‌రెడ్డి పాలనలో రెండు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి నీచ, నికృష్ట, దుర్మార్గ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనా చరిత్ర సమస్తం హీనమని, అధ్వాన, రాక్షస పాలన సాగుతున్నదన్నారు. గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు చూసినం.. మళ్లీ ఇప్పటి కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నామన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణను సాధించి.., తన పాలనా దక్షతతో దేశంలోనే గుర్తింపు తెచ్చారని అన్నారు. కాంగ్రెస్‌కు పాలనా అనుభవమున్నా చెడు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నదని ఆరోపించారు. ఒకప్పుడు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో కేసీఆర్ హయాంలో దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు.
కాంగ్రెస్ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు యూరియా కొరత, రైతుల చెప్పుల క్యూ ఉంటుందని కేసీఆర్ చెప్పారని, నేడు అదే జరుగుతున్నదన్నారు. గత కేసీఆర్ పాలన, నేటి కాంగ్రెస్ పాలనను విశ్లేషించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బాగుపడాలంటే రైతులను ఆదుకోవాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, రైతు సదస్సు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లపై పోరాటం మొదలుపెడతామని మధుసూదనాచారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఉపముఖ్య మంత్రి తాటికొండ రాజయ్య, మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, హరిరమాదేవి, పులి రజినీకాంత్, నయీమొద్దీన్, రాజ్ కిశోర్, జానకీరాములు, శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.
డిక్లరేషన్ పేరుతో హామీలిచ్చి అమ లు చేయని రైతు ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి. రైతులను ఇంత దగా చేసిన ప్రభుత్వాలను ఎన్నడూ చూడలేదు. రైతు డిక్లరేషన్ ప్రకటించిన ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచే సదస్సు నిర్వహించాలనుకున్నాం. కానీ, అనుమతి ఇవ్వడం లేదు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు చేసిందేమీ లేదు. కేసీఆర్ వచ్చాకనే రైతుల సమస్యలు తీరాయి. పెట్టుబడి సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధు కల్లాలప్పుడు ఇస్తున్నారు. అది కూడా ఎకరం ఎకరానికి ఇస్తున్నారు. ఇది రైతులను మోసం చేయడమే. ప్రస్తుతం కేటీఆర్‌ను తీసుకొచ్చి రైతుల పక్షాన రైతు సదస్సు నిర్వహిస్తున్నాం.
వచ్చే ఏడాది కేసీఆర్‌తో రైతుసభ నిర్వహిస్తాం. కాంగ్రెస్ పాలనలో నీటి, యూరియా, విద్యుత్ కొరతలతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రెండున్నరేళ్లలో ధాన్యం, పంటలు, నీటి సరఫరాపై ఈ ప్రభుత్వం ఏనాడూ రివ్యూ చేయలేదు. మకలు కొనుగోలు చేయడం లేదు. గన్నీబ్యాగులు ఇవ్వడం లేదు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ సరారు రైతులను దగా చేస్తున్నది. అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శ్రేణులే తిడుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని వాళ్లే బాధపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కల్లాల వద్దకు వెళితే ప్రజలు ఉరికించి కొట్టేలా ఉన్నారు. వడ్లు కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేలా చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సదస్సును అడ్డుకొనే ప్రయత్నం చేసినా నిర్వహించి తీరుతాం.
-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కల్లాలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉన్నది. ధాన్యం, మక్కల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. గన్నీబ్యాగులు ఇవ్వడం లేదు. దేశానికి అన్నంపెట్టే రైతును కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేసింది. నర్సింహులపేట గ్రామంలో మకజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వచ్చాను. అక్కడ రైతుల పరిస్థితి గందరగోళంగా ఉంది. రోజల తరబడి మార్కెట్ యార్డుల్లో ఎండకు ఎండుతున్నారు. కొనుగోళ్లలో కూడా కాంగ్రెస్ అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్నది. రైతును నట్టేట ముంచింది.
-మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ వేదికగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి అమలును మరించింది. వారి నిర్ల క్ష్యాన్ని ఎండ గట్టేందుకు, రైతుల కోసం పోరాడేందుకే రైతు సదస్సు నిర్వహిస్తున్నాం. సదస్సు నిర్వహణకు ప్రభుత్వ స్థలాల అనుమతులు కోసం దరఖాస్తు చేశాం. అనుమతి ఇవ్వలేదు. ఈ జిల్లా మంత్రులు జిల్లా కోసం ఏ పని చేయడం లేదు. వారి చేతుల్లో అధికారం లేదు. జిల్లాలో కాంగ్రెస్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంతా నడుపుతున్నారు. అతడి కాంట్రాక్ట్‌ల కోసమే రివ్యూ పెడతారు.. కానీ ప్రజల కోసం, రైతుల కోసం రివ్యూ పెట్టరు. హనుమకొండ జిల్లాలో మూడు పోస్టుల్లో ఒకే అధికారి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు బదిలీ అయినా ఇకడ అధికారులను నియమించలేదు. ఇకడి ఎమ్మెల్యేలు అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదు. కారణం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాపై అన్నీతానై నడిపిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
-ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
ఈ నెల 6వ తేదీన హనుమకొండలో 10వేల మందితో రైతు ప్రతినిథుల సదస్సు నిర్వహిస్తున్నాం. రైతు సభ కాదు.. రైతు సదస్సు మాత్రమే. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పేరుతో కుడా, కేడీసీ కాలేజీలో మైదానంలో సదస్సు నిర్వహించేందుకు దరఖాస్తు చేస్తే ఏవేవో కారణాలు చెబుతూ అనుమతి ఇవ్వడం లేదు. శుక్రవారం సాయంత్రం వరకు అనుమతి ఇవ్వాలి.
-బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలనపై అవగాహన లేదు. మహబూబాబాద్ మారెట్లోనే 2లక్షల బస్తాల మకజొన్న అమ్ముకునేందుకు మారెట్‌కు తీసుకొచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. రైతులు గోస పడుతున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా మకజొన్న పండింది. మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.వెయ్యి తకువకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి కోసమే రైతు సదస్సు.
– మాజీ మంత్రి రెడ్యానాయక్