వరంగల్ చౌరస్తా : గోవిందరాజస్వామి ఆలయ ప్రధానార్చకుడిని స్థానిక కార్పొరేటర్ అసభ్య పదజాలంతో దూషించారు. ఆదివారం ప్రారంభమైన ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి, నీశాదేవి సహిత గోవిందరాజస్వామి తిరుకళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న ఆలయ అనువంశీయ ఆర్చకులు వరయోగుల శ్రీనివాసస్వామిని అడ్డుకుంటూ మరో అర్చకుడితో కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఆదేశించడంతో ఆర్చకులు విస్తుపోయారు.
కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న శ్రీనివాసస్వామిని దూషిస్తూ ఆలయంలోకి రాకుండా చేస్తానంటూ భక్తుల ముందరే బెదిరింపులకు పాల్పడడంతో ఒక్కసారిగా ఇరువురి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. దీంతో ఆలయ ఆర్చకులు కలుగజేసుకొని ఇరువురిని శాంతింపజేసి, తిరుకళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కళ్యాణోత్సవం అనంతరం ఆలయ అర్చకుడు శ్రీనివాసస్వామిని దూషించిన విషయంపైవ వారిని వివరణ కోరగా ఆలయ ఆవరణలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆలయ భూములు కబ్జాలకు గురువుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక మంత్రి కొండా సురేఖని కలిసి ఆలయ భూములను, విశిష్టతను కాపాడటానికి చర్యలు చేపట్టాలని కోరిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే గత అక్టోబర్ నెలలో కాళభైరవ ఉపాలయంలో పూజలు నిర్వహిస్తున్న తన సోదరుడిపై సైతం దాడికి పాల్పడినట్లు తెలిపారు. దాడి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటుగా పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేక కళ్యాణోత్సవంలో వ్యక్తిగత దూషణకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం కోరతామని అన్నారు.