మహదేవపూర్(కాళేశ్వరం), మే 5 : పాలన చేతకాక, అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సరార్ అనేక కుట్రలు చేస్తూ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్వం చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయకుండా ఆగం చేస్తున్నదని.. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మున్ముందు జలసాధన ఉద్యమం తప్పదని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. వాస్తవాలు’పై చర్చావేదికకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సాగునీటి రంగ నిపుణులు వీరమల్ల ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ అపార జలరాశులున్న తెలంగాణ నీటి కోసం గోస పడుతున్న క్రమంలో కాకతీయులను ఆదర్శంగా తీసుకొన్న కేసీఆర్ నీటిని ఒడిసిపట్టే వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. పదేండ్ల పాటు కాళేశ్వర జలాలతో అనేక ప్రయోజనాలు పొందామని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేసే ఆలోచనతో చర్చా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని, దీంతో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, కరెంటుతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే ఏకైక మార్గమని గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. సాధించుకున్న తెలంగాణను తొమ్మిదిన్నరేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి చేసి ప్రపంచం దృష్టిని మన వైపు మరల్చేలా చేశారన్నారు.
సాగునీటి రంగంలో అపురూపమైన అభివృద్ధి సాధించారని అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్య పాలన గుర్తుకు వస్తున్నదన్నారు. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు కల్పతరువుగా మారిన ప్రాజెక్టులోని మూడు ఫిల్లర్లను రిపేరు చేయలేని దుస్థితిలో ఉండి రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. కనీసం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా రైతులకు నీళ్లు అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయకుండా కేసీఆర్ మార్క్‌ను చెరిపేయాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే మేనిఫెస్టో రాశాడని, ఇప్పు డు నియోజకవర్గంలో రైతులు సాగునీటికి తండ్లా డే పరిస్థితులు అతనికి కనిపించడం లేదా?, అధిష్టానంతో మాట్లాడే సత్తా లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలు ఇక సాగనివ్వమని, గ్రామగ్రామాన కాంగ్రెస్ కుట్రలపై చర్చ జరుగాలని, ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని కోరారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ సరారు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నదని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నీళ్లు అందించామని నల్గొండ, ఖమ్మం, మెదక్ లాంటి జిల్లాలను కాళేశ్వరం నీళ్లు సస్యశ్యామలం చేశామని గుర్తుచేశారు. ఎన్డీఎస్ఏ సైతం ఫిల్లర్లకు మరమ్మతులు చేసి నీళ్లను నిల్వ చేయాలని చెప్పిందని ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పలేదన్నారు. చిన్న సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం బూతద్దంలో పెట్టి చూపించి ప్రజలను నమ్మించే కుట్రలు చేసిందని, ఇప్పటికే కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు ఒకసారి మోసపోయారన్నారు. ఇలాంటి చర్చా వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మేలు చేస్తాడని నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన చరిత్ర ప్రస్తుత మంథని ఎమ్మెల్యేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్‌షాపులను తొలగిస్తామని, నాలుగు వేల పింఛన్, మహిళలకు రూ.2500, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తామని నమ్మించి వంచించాడన్నారు.
చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తామని చెప్పి ఈనాడు పంట లు సాగు చేసే భూములను లాకొని కాల్వలు తవ్వుతున్నారని, వెంటనే భూసేకరణ నిలిపివేసి గ్రామసభల ద్వారా పరిశీలన చేసి పనులు చేయాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, దుర్గం చిన్న య్య, భూపాలపల్లి, జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, దావ వసంత, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేశ్, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు మాడ హరీశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు వసంత, శ్రీపతి బాపు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే