నర్సంపేట, జూన్ 12 : గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అవినీతి కుట్రలు చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై రాష్ట్ర ప్రజలు, రైతాంగం చైతన్యం కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై ఆంధ్రా ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నాడని, తన గురువు చంద్రబాబు కోసం తెలంగాణ సీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రెండేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా వినియోగించకుండా రైతుల పొలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందని మండిపడ్డారు.
ఆంధ్రాలో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం లేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌లను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్ట్, రామప్ప, పాకాల, రంగాయ చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్ట్‌లు ఎండబెట్టే కుట్ర జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌లను ఎండబెట్టి ఆంధ్రా ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించే కుట్రకు గురుశిష్యులు తెరలేపారని, గోదావరి జలాలపై తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను ఘోష్ కమిషన్ ముందుకు పిలిపించి రాక్షసానందం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్మూ, ధైర్యం లేదని, పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే స్థానిక ఎన్నికలను ఆలస్యం చేస్తున్నదన్నారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని పెద్ది స్పష్టం చేశారు.