Clash : పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తాజాగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కూడా అలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. చలిమంట దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు తీవ్రంగా కొట్టుకున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో చలిమంట కాగుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అటుగా వచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురవడంతో మేమే గెలుస్తాం అంటే, మేమే గెలుస్తాం అని సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా మాటామాటా పెరగడంతో పరిస్థితి కొట్టుకునే దాకా వెళ్లింది. ఇరువర్గాల కార్యకర్తలు చలిమంట వేసుకున్న కొర్కాసులతోనే కొట్టుకున్నారు.
ఈ ఘర్షణల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.