హనుమకొండ, మార్చి 6 : రాష్ట్రంలో ప్రగతే లేనప్పుడు, ప్రగతి ప్రణాళిక ఎందుకని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 99 రోజుల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేరుతో అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నడిచేది ప్రజా పాలన కాదని ప్రతీకార, దోపిడీ పాలన అని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసి, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని శిల్పకళావేదికలో రేవంత్‌రెడ్డి ఎస్సీ ఉద్యోగులతో సన్మానం చేయించుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీలకు ఏం చేశారో శిల్పకళా వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.12 లక్షల ఆర్థిక సాయం,18 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల హామీలు ఏమైందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చి పీసీ ఘోష్ కమిషన్ వేసిందని, విద్యుత్ కుంభకోణం జరిగిందని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసి కాలయాపన చేసిందని, మొబిలిటీ వ్యాలీ పేరుతో రాష్ట్ర స్థాయిని పెంచాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసు, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని నిలదీసినందుకు హరీశ్‌రావుపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారులు ప్రతి రోజూ చేసే పనులే 99 రోజుల ప్రణాళికలో చేయాలని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు.
శానిటేషన్, పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం వంటివి అధికారులు రోజూ చేసే పనులేనని, అందుకే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నదని, కొత్తగా 99 రోజుల ప్రణాళికలో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులందరూ పాలకుల చుట్టూ తిరిగేలా ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం రూపొందించారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి కొత్వాల్‌గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో గుట్టలు నాశనం చేసి కంకర సప్లయ్ చేస్తూ రాష్ట్ర వనరులను దోచుకుంటూ మానుకోటకు వచ్చి ప్రగతి గురించి మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇతర క్రషర్లకు వివిధ రకాలైన అనుమతులు లేవని అధికారులు నోటీసులు ఇస్తున్నారు, కానీ, పొంగులేటికి చెందిన క్రషర్ కంపెనీలకు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు రాసి ఉన్న కంటైనర్లకు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని రాత్రికి రాత్రే కలర్ వేసి తూడ్చే ప్రయత్నం చేశారన్నారు. పేర్లను తుడిచినట్టుగా మీరు చేసిన దోపిడీని తుడవలేరని అన్నారు.
ఖమ్మం వెలుగుమట్లలో 4వేల మంది పోలీసులతో 2వేల పేద కుటుంబాల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని, మరో గాజాగా మార్చారన్నారు. పేదలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటున్న మీరు ప్రజా పాలన ప్రగతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమ్మక, సారలమ్మ జాతర పనుల కాంట్రాక్టులు తీసుకొని నాసిరకం పనులు చేసి దోచుకున్నారని విమర్శించారు. భూ భారతి పేరుతో మీ సేవ కేంద్రంలో జరిగిన వందల కోట్ల దోపిడీ జనగామలో బయటపడిందని పేర్కొన్నారు. అందుకే మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి ప్రణాళిక గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు.
ఆగస్టు 26, 2023లో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఎస్సీలకు రూ.12 లక్షల ఆర్థిక భరోసా అని, ఒక పైసా ఇవ్వలేదన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. పీజీ చేస్తే రూ.లక్ష, పీహెచ్డీ చేస్తే రూ.5లక్షలు ఇస్తామని హామీలిచ్చారని, ఇప్పటి వరకు ఎందరికిచ్చారని ప్రశ్నించారు. గురుకులాల్లో 125మంది విద్యార్థులు చనిపోయేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు.
మరోపక ఆకునూరి మురళితో గురుకులాలను బంద్ చేయిస్తామని చెప్పిస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాల విద్యార్థులను కూలీలుగా తయారు చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. భద్రకాళీ దేవాలయం వద్ద పేదలు హోటళ్లు పెట్టుకుంటే కుడా అధికారులు కూల్చేశారు.. కానీ, హైదరాబాద్‌లో మల్లు రవికి అప్పనంగా రూ. 8కోట్ల భూమిని ఎలా అప్పగించారని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చుతున్న హైడ్రా అధికారులు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూలగొట్టడంలేదన్నారు? ఎన్నో సంవత్సరాల తర్వాత కాజీపేటకు వచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాకపోతే న్యాయం జరగదన్నారు.
మహారాష్ట్ర లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టి 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చారని, కాజీపేటలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాయకత్వంలో పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్లే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ సంపదను దోచుకొనే శక్తులపై బీఆర్ఎస్ పార్టీ విరోచిత పోరాటం చేస్తుందని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, కార్పొరేటర్లు ఇమ్మడి రాజు, మనోజ్, ప్రశాంత్, సదాంత్, పూర్ణచందర్ పాల్గొన్నారు.