హనుమకొండ, జూన్ 20 : రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సోమవారం హనుమకొండలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్నతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
సమైక్య పాలనలో రైతులు ఆగమయ్యారని, నాడు ఎరువులు, విత్తనాలు, కరెంటు కోతలతో ఇబ్బందులు పడి ఆత్మహత్యలకు పాల్పడేవారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేదని విధంగా రైతుబంధు, బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి సంక్షేమ కార్యక్రమాలతో రైతును రాజును చేశారన్నారు. ప్రస్తుతం అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలు సక్రమంగా కొనలేదని, బోనస్ బోగస్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ శ్రేణులను గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని, వెళ్తే ఉరికించి కొడతారన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని దాస్యం హెచ్చరించారు. రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం పోచంపల్లి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అనేక ప్రాజెక్టులు నిర్మించారన్నారు. మహిళల అభ్యున్నతికి సొంత నిధులతో కృషి చేస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిపై రాజకీయాల కోసం అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. పరకాల ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికని, చౌకబారు విమర్శల కోసం కాదని హితవు పలికారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, లలితాయాదవ్, బీఆర్ఎస్ నాయకులు బండి రజినీకుమార్, సిరంగి సునీల్, వర్ధన్నపేట నియోజకవర్గ శ్రేణులు పాల్గొన్నారు.
రేపు కేటీఆర్ పర్యటన : అరూరి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లాకు వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో సర్, సభ్యత్వ నమోదుపై బీఎల్ఏలు, సోషల్ మీడియా ప్రతినిధులు 2,500 మందికి నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యాక్రమంలో పాల్గొని వారికి దిశా నిర్దేశం చేస్తారన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమంలో కొనసాగుతుందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు.
ఎ న్నికల హామీల అమలును మరిచి రైతులను సీఎం రేవంత్ గోస పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు తప్ప సంతోషం లేదన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా ఎగ్గొట్టారని, బీమా బంద్ చేశారని, బోనస్ బోగస్ అయ్యిందని, రైతుల పంటలు కొనుగోలు చేయడం లేదని, అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. పంటలు కేంద్రం ఎంత కొంటే మేము అంతే కొం టామంటూ రేవంత్‌రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నత వర్గాలు, బడా కాంట్రాక్టర్ల కోసం రైతులు, ప్రజలను ఆగం చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రేవంత్‌రెడ్డి 70 సార్లు ఢిల్లీ వెళ్లి తెలంగాణకు తెచ్చిందేమీ లేదని, నాడు కేసీఆర్ రైతుల పక్షాన కేంద్రంపై పోరాటం చేశారని అరూరి తెలిపారు.