కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ‘సమగ్ర కుటుంబ’ సర్వేతో అందరిలో టెన్షన్ పట్టుకుంది. వివరాల కోసం వచ్చే ఎన్యుమరేట్లు అడిగే ప్రశ్నలు, వారు సేకరించే సమాచారంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి 56 ప్రశ్నలే కనిపిస్తున్నా.. ఉప అంశాలు కలిపి చూస్తే 75 అంశాలతో పూర్తి సమాచారం సేకరించేందుకు వీలుగా రూపొందించారు. అయితే ఎక్కువగా కుటుంబ, వ్యక్తిగత వివరాలే ఉన్నందున ఉన్నది ఉన్నట్టు చెబితే పాత రేషన్‌కార్డులు.. గత ప్రభుత్వ హయాం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు ఉంటాయా? పోతాయా? అని సవాలక్ష సందేహాలు ఇటు ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులనూ వెంటాడుతున్నాయి. అందుకే చాలాచోట్ల ఆదాయం, ఆస్తుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇచ్చినా వాస్తవ సమాచారం ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతుండగా సర్వే కోసం వచ్చే వారికి తమ కార్లు, ఇతర వాహనాలు కనిపించకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది.
– జనగామ, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై (సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే) ఇటు సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ భయం పట్టుకుంది. ప్రభుత్వం సర్వే పేరుతో అనేక వ్యక్తిగత వివరాలు సేకరించడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే సమయంలో అధికారులు, సిబ్బంది అడిగే అన్ని వివరాలు ఇవ్వాలా? వద్దా? అనే సందేహాలు ప్రజల్లో కనిపిస్తున్నది. ఒకవేళ ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని చెబితే సంక్షేమ పథకాలు వర్తిస్తాయా? లేదా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా, రుణమాఫీ కోసం అనేక కొత్త నిబంధనలు పెట్టింది.
ఆదాయ, వాణిజ్య పన్ను వంటివి చెల్లించే వారికి సంక్షేమ పథకాలు, తెల్లరంగు రేషన్‌కార్డు తొలగించాలన్న వాదన తెరపైకి వస్తున్నది. దీంతో ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనే సంశయం నెలకొన్నది. సర్వేకు అధికారులు, సిబ్బంది వస్తున్నారంటే ఇంటి ముందున్న కారు, ద్విచక్ర వాహనం వంటి ఇతర చరాస్తులు కంటపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు సర్వే కాలం నంబర్ 20లో పొందుపరిచిన అంశాన్ని పరిశీలిస్తే.. మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు? అని.. దీనికి అనుసంధానంగా కాలం నంబర్ 23లో వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్త అయితే వార్షిక టర్నోవర్ వివరాలను నమోదు చేయాలని సూచించారు.
కాలం నంబర్ 29లో మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? అని ఉంది. అలాగే కాలం 30లో మీకు బ్యాంకు ఖాతా ఉందా? లేదా? కులవృత్తిదారులకు సంబంధించి వార్షిక ఆదాయ వివరాలు సహా కాలం 31 నుంచి 40వరకు భూముల వివరాల్లో ధరణి పాస్‌పుస్తకం సహా తరి, ఖుష్కి, పడావు భూములు, పట్టా? ఇనాం, ప్రభుత్వానిదా? అనే వివరాలు అడిగారు. పార్టు-2లో ఇంటి యజమానుల స్థిర, చరాస్తుల వివరాలు, నివాస గృహ విస్తీర్ణం నుంచి మొదలు ఇంటిలో గదుల సంఖ్య వరకు వివరాలు సేకరిస్తున్నారు.
రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలకు కుదించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వివరాలు సమగ్రంగా సేకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన కోసం జనగామ జిల్లాలో 1,62,512 కుటుంబాలు, 1,350 బ్లాకుల్లో సర్వే కోసం 1,350 మంది ఎన్యుమరేటర్లు, 145 మంది సూపర్వైజర్లను నియమించి ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంటింటికీ స్టిక్కర్లు వేసి.. 9నుంచి కుటుంబ సర్వేను ప్రారంభించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇండ్లు కేటాయించి ప్రతిరోజూ 10 ఇండ్ల సర్వే పూర్తి చేయాలన్న విధివిధానాలతో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి సర్వే వివరాల నమోదును ప్రారంభించారు.
సర్వేలో సేకరిస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఇప్పటికే అమల్లో ఉన్న తెల్లరేషన్ కార్డులుంటాయా? ఊడుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని రేషన్‌కార్డుతో ముడిపెట్టకుండా డిజటల్కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కుటుంబ యజమాని స్థిర, చరాస్తుల వివరాలు ఇస్తే కార్డులు పోయే ప్రమాదం లేకపోలేదనే అనుమానాలు వస్తున్నాయి. ఆస్తులు మాత్రమే కాదు.. అప్పుల వివరాలు కూడా సేకరిస్తున్నట్టు ఫార్మాట్లో ఒక అంశాన్ని చేర్చింది. అయితే నూటికి 90శాతం కుటుంబాలకు ఏదో రూపంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దో లేదా బ్యాంకుల్లోనో అప్పు ఉంది.
ఆస్తుల వివరాలు చెబితే ఉన్నవి ఊడపీకేస్తుంది తప్ప.. అప్పుల వివరాలు చెబితే ప్రభుత్వం ఏమైనా తీరుస్తుందా? అన్న ప్రశ్న ప్రజల్లో తెలెత్తుతున్నది. అప్పుల పేరుతో ఆస్తుల వివరాలు సేకరించడమే లక్ష్యంగా సర్వే ఫార్మాట్‌ను రూపొందించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటితో పాటు ఇంటి విస్తీర్ణం, ఇంట్లో వాడుతున్న గదులు వంటి అంశాలను బట్టి చూస్తే ఇంటి కరెంటు బిల్లు మాఫీకి కోతలు పెట్టవచ్చనే అనుమానాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక రోజులోనే పూర్తిచేసి అదనపు సంక్షేమ కార్యక్రమాలు విస్తరించి తప్ప కోతలు పెట్టలేదు.
కొర్రీలు పెట్టకపోగా.. కొత్తగా రైతు రుణమాఫీ, రైతు బంధు, దళితబంధు లాంటి పథకాలు పెట్టిందని గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటిపై స్పష్టత ఇవ్వకుండా సాగదీత ధోరణి అవలంబిస్తూ ఆరు గ్యారెంటీల అమలులో తిరకాసు పెట్టాలన్నది లోగుట్టుగా కనిపిస్తున్నదనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో సర్వే అధికారులు, సిబ్బందికి ప్రజలు సంపూర్ణ వివరాలు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా వాస్తవాలు మాత్రం చెప్పడం లేదనే ప్రచారం జరుగుతోంది.
నర్సింహులపేట, నవంబర్ 12 : ‘క్షేత్రస్థాయిలో సర్వేతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.. ఒక పూట బడి.. మరో పూట సర్వే వల్ల సమయానికి పూర్తి చేయలేకపోతున్నా’మని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రోజుకు 15 నుంచి 20 కుటుంబాలు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఒక కుటుంబానికి కనీసం 40 నిమిషాల సమయం పడుతున్నదని దీని వల్ల రోజుకు 5, 10 కుటుంబాల సర్వే మాత్రమే సాధ్యమవుతున్నందున స్థానిక సిబ్బందిని నియమించాలని నర్సింహులపేట మండలానికి చెందిన టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వై.క్రాంతికుమార్, ఎనమాల శ్రీనివాస్ కోరుతున్నారు. ఈమేరకు మంగళవారం వేణుగోపాల్, యాకన్నతో కలిసి ఎంపీవో యాకయ్యకు వినతిపత్రం అందించారు.