జనగామ, జూన్ 24 (నమస్తే తెలంగాణ)/జనగామ చౌరస్తా : తన భూమి సమస్యను పరిష్కరించాలని ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నాడు. పలుమార్లు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి విన్నవించాడు. వారు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తాను బతికుండగా భూమి దక్కదని, చనిపోతేనే పరిష్కారం లభిస్తుందని భావించాడు. సమీకృత కలెక్టరేట్ భవనం పైకెక్కి పురుగుల మందు తాగాడు. ఈ ఘటన జనగామ కలెక్టరేట్లో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం పసరమడ్లకు చెందిన యువకుడు నిమ్మల నర్సింగరావు తండ్రికి గ్రామంలోని సర్వే నంబర్ 159, 160, 231/డిలో పూర్వీకుల నుంచి వచ్చిన 3.15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరి కుటుంబం 2016లో బతుకుదెరువు కోసం మేడారం వెళ్లడంతో ఆ భూమిపై దాయాదుల కన్ను పడింది. 2017లో అప్పటి తహసీల్దార్ జే రమేశ్, వీఆర్వో క్రాంతికి సదరు భూ యజమానులు చనిపోయారని నమ్మించడంతో పాటు లంచం ఇచ్చి పాండు, ఎల్లయ్య, ఉపేందర్, శివకుమార్ పేర్లపై పట్టా చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న నర్సింగరావు అప్పటి నుంచి తన భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్వయంగా కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేకపోవడంతో గతంలో మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కొనసాగిన పాత కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్, కొత్త కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకోగా, మరోసారి తన భార్యతో కలిసి ఇదే భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశాడు. తాజాగా సోమవారం ప్రజావాణికి వచ్చిన నర్సింగరావు అధికారుల సమాధానం సరిగా లేకపోవడంతో కలెక్టరేట్ పైకి ఎక్కాడు. తనతో తెచ్చుకున్న ఫ్లెక్సీని గోడకు కట్టి పురుగుల మందు తాగాడు. అక్కడున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా సంబంధిత భూమి వివాదం కోర్టులో ఉందని తెలిపారు.
ఆత్మహత్యాయత్నం చేసిన నిమ్మల నర్సింగరావుకు సంబంధించి భూమి వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసరమడ్ల గ్రామంలో నర్సింగరావు ముత్తాత నిమ్మల మైసయ్యకు 8.16 ఎకరాల భూమి ఉండగా, పాలోళ్లు ఎల్లయ్య, పాండు 3.20 ఎకరాల భూమిని 2017లో అక్రమంగా పట్టా చేసుకున్నారని తెలిపారు. దీంతో నర్సింగరావు ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడని, ఈ విషయమై నిమ్మల పాండు జనగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నర్సింగరావుతోపాటు మరో నలుగురిపై దావా వేసి ఇంజెక్షన్ ఆర్డర్ పొందినట్లు చెప్పారు. ఈ వివాదాన్ని సివిల్ కోర్టు లేదా లీగల్ సర్వీసెస్ ద్వారా పరిష్కరించుకోవాలని గతంలో నర్సింగరావుకు అధికారులు సూచించారని, అయినా పదే పదే ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించి పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయం పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.