పరిగి, జూన్ 5 : కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య కోరారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిగి పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వేసే ప్రతి అడుగు కాలుష్య నివారణకు ముందడుగు నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణం, చెట్ల ప్రాముఖ్యత, వాటి అవసరాలు, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందించే విధానంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
ప్లాస్టిక్ నిషేధం వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా కాలుష్య నివారణలో అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అలాగే వాటిని పరిరక్షించే బాధ్యత అందరు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులకు మొక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేష్, అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, వివిధ మహిళా సంఘాల సభ్యురాళ్లు తదితరులు పాల్గొన్నారు.