హనుమకొండ, అక్టోబర్ 16 : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మూడు రోజులుగా కళాశాలల నిరవధిక బంద్‌లో పాల్గొంటూ బాలసముద్రంలోని ఏకశిల పార్కు ఎదుట శాంతి దీక్ష చేపట్టారు. టీపీడీఎంఏ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుమారు 70 కళాశాలల యాజమాన్యాలు, సిబ్బందితో కలిసి ఏకశిల పార్కు నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు సుమారు వెయ్యి మందితో శాంతియుతంగా భారీ ర్యాలీ తీసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు శ్రీధర్‌రావు, రవీంద్రనాథ్, ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫీ రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు స్పందించడంతో పాటు ఫీజు బకాయిలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవంబర్‌లో విడుదల చేసిన టోకెన్ నంబర్లకు సంబంధించిన రూ. 600కోట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. లేకపోతే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ వేణుమాధవ్, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర గోలి వెంకట్ పాల్గొన్నారు.