హనుమకొండ, జూన్ 30 : స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటై విజయవంతంగా సాగుతుండగా జిల్లా కలెక్టర్ సందర్శించారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రుల సమక్షంలో గతేడాది జూన్ 29వ తేదీన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు.
ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఇతర అధికారులతో కలిసి క్యాంటీన్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. నిర్వాహకులు నికితాంజలి బృందంతో కలెక్టర్ సంభాషించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా మహిళలు మరింత ఆర్థిక పురోగతిని సాధించాలని కలెక్టర్ అన్నారు.
మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించిందని, తద్వారా మహిళలు పురోగతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, మెప్మా కోఆర్డినేటర్ రజిత రాణి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.