స్టేషన్ ఘనపూర్ జూన్ 13 : బడి ఈడు పిల్లలందరు బడిలో ఉండాలని, బాల్య దశ నుంచే వారు విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని మారెడుపాక రాణికి చెందిన రెండవ అంగన్వాడీ కేంద్రంలో బెల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలకు అక్షరాభ్యాస నిర్వహించి, పలకలు పుస్తకాలు అందించారు. వారికి ఎగ్ బిర్యాని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అంగన్వాడీ పిల్లలతో పాటలు పాడించి వారిలోని సృజనాత్మకతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం అంగన్వాడి కేంద్రం ముందు మొక్కలు నాటి అమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ నిర్వహించారు.
ప్రైవేట్ పాఠశాలలో లేని విధంగా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందిస్తారన్నారు. భవిత కేంద్రంను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. వారికి కావాల్సిన వస్తువులు అందించాలని, వారికి ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్, ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈవో జి. కొమురయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ యం సంపత్, పిహెచ్ సి డాక్టర్ రుబీనా, ఆర్ఐ లు శ్రీకాంత్, సతీష్, ఎమ్మార్సీ గిరి, తదితరులు పాల్గొన్నారు.