వరంగల్ చౌరస్తా, జూన్ 20 : ఎంజీఎం దవాఖాన 13వ నంబర్ గదిలో నిర్వహిస్తున్న ఆర్థో పెడిక్ ఓపీ (మహిళలు) విభాగంలో వైద్యులు ఆందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. 13 మంది పేషెంట్లు డాక్టర్ల కోసం ఎదురుచూడడంపై మండిపడ్డారు. అందుబాటులో లేని, విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఎంజీఎంహెచ్‌లో విభాగాల వారీగా తనిఖీ చేశారు.
ఆయా విభాగాల్లో యంత్రాల పని తీరును అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఐసీయూలోని కార్డియాలజీ విభాగంలో మరమ్మతులకు గురైన పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో ఉన్న కాగితాలను నర్సింగ్ ఆఫీసర్, రెసిడెంట్ డాక్టర్‌తో చదివించారు. వైద్యం కోసం వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఎంజీఎం వార్డు గోడలకు ఆనుకొని హోటల్స్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన మదర్ ఫీడింగ్ రూం, అటెండెంట్ విడిది గదులను పరిశీలించారు.
రికార్డులను నమోదు చేయకపోవడంపై ఆగ్రహించారు. 47వ నంబర్ ఓపీ ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను వెంటవెంటనే పూర్తి చేయాలని, నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించడానికి ఒక రోజు సమయాన్ని తీసుకోవడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఎంసీహెచ్ విభాగం పక్కన రోడ్డు మధ్యలో ఉన్న బావిని పూడ్చాలన్నారు. వయో వృద్ధుల వార్డును ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు ఉన్న గదినిఎంపిక చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, విభాగాధిపతులు, ఆర్ఎంవోలు తదితరులు పాల్గొన్నారు.