వరంగల్‌చౌరస్తా, నవంబర్ 29: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె దవాఖానను సందర్శించారు. త్వరలో ప్రారంభించనున్న ఇందిరమ్మ క్యాంటిన్‌తోపాటు రోగులకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసిన ఆరు నూతన ఓపీ టికెట్ కౌంటర్లు, వృద్ధుల ఓపీ విభాగం, విశ్రాంతి హాల్, మూత్రశాలలను పరిశీలించారు. నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ 2024ను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో సీఎం కప్ నిర్వహనపై అధికారులతో సమీక్షించారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివిధ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 7, 8న గ్రామ స్థాయి, 10 నుంచి 12 వరకు మండల స్థాయి, 16 నుంచి 21వ తేదీ వరకు జిల్లాస్థాయిలో వాలీబాల్, యోగా, అథ్లెటిక్స్, ఖోఖో, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, సైక్లింగ్,
టేబుల్ టెన్నీస్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, అర్చరీ, చెస్, జూడో, బేస్ బాల్, నెట్ బాల్, సాఫ్ట్ బాల్, జమ్నాస్టిక్, కరాటే, హాకీ, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, స్మింగ్, షూటింగ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో డీసీపీ రవీందర్, డీఎంహెచ్‌వో సాంబశివరావు, డీవైస్వో సత్యవాణి, డీపీవో కల్పన, ఉప కమిషనర్ కృష్ణారెడ్డి, సీఎంహెచ్వో డాక్టర్ రాజిరెడ్డి, ఈఈ శ్రీనివాస్‌తోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే, బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో ఏర్పాటు చేసిన సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
కాశీబుగ్గ: జిల్లాస్థాయి చీఫ్ మినిస్టర్ కప్ నిర్వహణలో భాగంగా వివిధ స్పోర్ట్ అండ్ గేమ్స్ అసోసియేషన్లతో ఓసిటీ స్టేడియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీవో సత్యవాణి ఏయే ఆటలు ఎక్కడ నిర్వహించాలో వాటి వివరాలను ఆయా అసోసియేషన్లకు క్లుప్తంగా వివరించారు. అలాగే, స్పోర్ట్స్ అథారిటీ వారు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను కూడా వివరించారు. సీఎం కప్‌ను విజయవంతం చేయాలని ఆమె కోరారు.