ఖానాపురం,జూన్ 10 : పర్యాటక ప్రదేశమైన పాకాలను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తో కలిసి పాకాలలో గ్రీన్ హెరిటేజ్ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులను బ్యాటరీ కారుపై తిరుగుతూ పరిశీలించారు. అదేవిధంగా ఆమె పాకాల సరస్సులో బోటు షికారు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాకాల పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఎఫ్ఓకు సూచించారు.
బయోడైవర్సిటీ పార్కును ఆధునీకీకరించాలని, పర్యావరణ, పర్యాటక అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. సఫారీ ట్రాక్ ఏర్పాటు ఔషధ మొక్కల పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. పర్యాటకులు రాత్రివేళ పాకాలలో బస చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాకాల పర్యటక అభివృద్ధికి తాను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవి కిరణ్, డీఆర్ఓ రీనా, అటవీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.