Drugs | ఖిలావరంగల్, ఫిబ్రవరి 20 : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో అదనపు కలెక్టర్ సీ సంధ్యారాణి, డీసీపీ రవీందర్‌తో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అవగాహన కల్పించడం వల్ల యువతలో చైతన్యం కలగడంతోపాటు సమాజంలో మార్పును తీసుకురావచ్చన్నారు. అనంతరం విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు గురించి, ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను పోలీసు, ఎక్సైజ్ టీఎస్ న్యాబ్, అటవీ, జీఆర్పీ పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
డీసీపీ రవీందర్ మాట్లాడుతూ.. ప్రతి నెల నార్కోటిక్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపడుతూ మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్న వదిలి పెట్టడం లేదన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే డయల్ 100కు సమాచారం చేరవేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచి విచారణ చేపట్టి నిర్వహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చందర్, ఎఫ్ఆర్వో సందీప్, నార్కోటిక్స్ డిఎస్పీ సైదులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అరవింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.