ఖిలావరంగల్, ఫిబ్రవరి 24: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సోమవారం వరంగల్ కలెక్టరేట్లో పీవో, ఏపీవో, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీవోలు, ఏపీవోలకు కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను ఆకళింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఇది వరకు నిర్వహించే ఎన్నికల విధులే కదా అని శిక్షణ తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తెలుసుకోవాలన్నారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 27వ తేదీన ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నెంబర్లు అందించి వారిచే ఓటింగ్ జరిపించాలన్నారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. చెక్ లిస్ట్‌లో పొందుపర్చబడిన దానికి అనుగుణంగా మెటీరియల్ అంతా కేటాయించబడినదా లేదా అన్నది జాగ్రత్తగా సరి చూసుకోవాలన్నారు. పోలింగ్ సామగ్రిని పరిశీలించుకున్న మీదట తమ బృందంతో కలిసి అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యానికి తావిస్తూ, తప్పిదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పీవోలు, ఏపీవోలు తీసుకోవాల్సని జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యల గురించి మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ఎన్నికల ఏఆర్వో విజయలక్ష్మి, వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.