సంగెం, నవంబర్ 24: ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల సంక్షేమంపై ఉపాధ్యాయులు, నిర్వాహకులు, అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. సంగెంలోని కేజీబీవీ, ఎస్టీ హాస్టల్‌ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంప్లెంట్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగా.. సేవ్ వాటర్, సేవ్ ఫుడ్ అని రాసి ఉంది.
అనంతరం తరగతి గదులు, కిచెన్, వంట సామగ్రి, బియ్యాన్ని పరిశీలించారు. తర్వాత విద్యార్థినులతో ముచ్చటించారు. మీకు నచ్చిన, మంచిగా బోధించే, మోటివేషన్ ఇచ్చే టీచర్లు ఉంటే కాంప్లెంట్ బాక్స్‌లో రాసి వేయాలని, ఆ బాక్స్ కేవలం సమస్యల కోసమే కాదని, అన్ని విషయాలను అందులో వేయొచ్చని సూచించారు. అనంతరం పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు.
తాగునీటి సమస్య ఉందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్వో నీలిమ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఆర్వో ప్లాంట్‌ను మంజూరు చేశారు. పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని, ప్రస్తుతం క్యాన్వాటర్ తెప్పిస్తున్నామని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మండలకేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని గదులను కలియతిరిగి పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
గీసుగొండ: రైతులు తాలు, చెత్తాచెదారం లేకుండా కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. మండలకేంద్రంలో హార్వెస్టర్ ద్వారా చేపట్టిన వరి కోతలను ఆమె పరిశీలించారు. నాణ్యమైన వడ్లను రూ. 2830 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్యాడీ క్లీనర్‌తో ధాన్యాన్ని శుభ్రం చేయాలని, తేమ శాతం 8 నుంచి 12లోపు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం గీసుగొండ సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే, రైతులు సీసీఐ కేంద్రాల్లో మాత్రమే పత్తిని విక్రయించాలని సూచించారు. రైతులు కూరగాయాల పంట సాగు వైపు దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఏవో అనురాధ, ఏవో హరిప్రసాద్‌బాబు, ఏఈవో కావ్య, సీఈవో ప్రదీప్ పాల్గొన్నారు.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మనం అందించి ఆహారమే ముఖ్య భూమిక పోషిస్తుందని కలెక్టర్ సత్య శారద అన్నారు. పీఎం పోషణ్ అభియాన్‌లో భాగంగా డీఈవో ఆధ్వర్యంలో వంచనగిరిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లాస్థాయి మధ్యాహ్న భోజన వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే మహిళలు పాల్గొన్నారు.
మొదటి బహుమతిని ఖానాపురం మండలం అశోక్‌నగర్ జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజన కార్మికురాలు సునారీ సుశీల, ద్వితీయ బహుమతిని గీసుగొండ మండలకేంద్రానికి చెందిన రేణుక, తృతీయ బహుమతిని నల్లబెల్లి మండలానికి చెందిన స్వప్న గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంట గది, స్టోర్‌రూంను పరిశీలించారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. హాస్టళ్లలో శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో జ్ఞానేశ్వర్, హెచ్ఎం నర్సింహాచార్యులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎస్వో హిమబిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.