ఖిలా వరంగల్: అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలు, జనాభా నియంత్రణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ జనాభా దినోత్సవంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా నియంత్రణ అదుపులో లేకపోతే భావితరాలకు శాపంగా మారి అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అలాగే లింగ అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు వస్తాయన్నారు. వనరులు సరిపోక సమస్యలు ఉద్భవిస్తాయని తెలిపారు.
జనాభాను నియంత్రణలో ఉంచడానికి బాలికల విద్యను ప్రోత్సహించి బాల్య వివాహాలను నిర్మూలిం చాలన్నారు. గర్భ నిరోధక పద్ధతులపై అవగాహన కల్పించి ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలలో జనాభా పెరుగుదల వలన వచ్చేసమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జనాభా నియత్రణకు కృషిచేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని సన్మానించారు.
అలాగే కుటుంబ నియంత్రణ పద్దతులు పాటించిన దంపతులకు రూ.1000 ప్రోత్సాహక బమతిని కలెక్టర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, ఆర్ఎంవో డాక్టర్ శశికుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్చన, డాక్టర్ ఆచార్య, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ మోహన్‌సింగ్, వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, నర్సింగ్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.