ఖిలావరంగల్, నవంబర్ 25 : ధాన్యం కొనుగోలు, కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద కోరారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ వీసీ హాల్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యం ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లుగా గుర్తించిన తర్వాతనే ఎలాంటి కోత విధించకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ విషయంలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భవిష్యత్‌లో ఎలాంటి వ్యాపారం చేయకుండా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, డీసీవో నీరజ, డీఏవో అనురాధ, మిల్లర్ల అధ్యక్షుడు సంపత్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ జిల్లాకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ అధికారులతో కలెక్టర్ సత్య శారద ముఖాముఖి మాట్లాడారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, అధ్యయనంతోపాటు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కలెక్టర్ వారికి సూచించారు. వచ్చే నెల 3 వరకు జిల్లాలో పర్యటన ఉంటుందని తెలిపారు.
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 107 మంది వినతులు సమర్పించారు. ఖిలావరంగల్ రోడ్డులోని బొడ్రాయి ప్రతిష్ఠాపన అనంతరం మిగిలిన రూ.13 లక్షలు నిర్వహకుడు సారంగపాణి తన వద్దే ఉంచుకున్నాడని విద్యానగర్‌కాలనీకి చెందిన అచ్చ వినోద్‌కుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే, వివిధ శాఖల్లో నియమించిన వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఒక ఎకరం సాగు భూమి, నాలుగు గదుల పక్కా ఇళ్లు అందజేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
అలాగే, వరంగల్ ఎంజీఎం దవాఖానలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ అధ్యక్షుడు నాగరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం దరఖాస్తుల్లో ప్రధానంగా 43 భూ సంబంధిత సమస్యలు రాగా డీఆర్డీవో 12, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు 9, డీఎంహెచ్‌వోకు చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఆర్డీవో కౌసల్యాదేవి తదితరులు పాల్గొన్నారు.