ఖానాపురం,మే 30: వర్షాకాలం ఆరంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాగంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్యాడి క్లీనర్ పనితీరును పరిశీలించారు. రైతులు ప్యాడి క్లీనర్ లో ధాన్యాన్ని శుభ్రపరచుకున్నాకే కాంటాలు పెట్టాలని సూచించారు.
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఇంకా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని, పాకాల ఆయకట్టులోనే 15వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని అన్నారు. కాంటాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంటాలైన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మిల్లర్లు అధికంగా కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డి సి ఓ నీరజ, సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి తదితరులు ఉన్నారు.