ఖిలా వరంగల్ : నులి పురుగుల(Roundworms) నివారణకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Sathya Sarada) అన్నారు. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వరంగల్ కలెక్టరేట్లోని వీసీ హాలులో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1810 పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు 1,81,807 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ ఈ నెల 10వ తేదీన ఆల్ఫెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు.
పదవ తేదీన మాత్రలు తీసుకొని పిల్లల్ని గుర్తించి మరోసారి ఈ నెల 17న అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మాత్రలు వేయడం వల్ల పిల్లల్లో నులి పురుగుల సమస్య, రక్తహీనత, బుద్ధి మాంద్యం సమస్య పట్ల ఉపశమనం కలిగి చదువుల పట్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఆల్ఫెండజోల్ మాత్రలు పంపిణీ పై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే విద్యార్థులకు మాత్రలు వేయాలన్నారు. రెండు సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు సగం టాబ్లెట్ చూర్ణం చేసి నీళ్లలో కలిపి తాగించాలన్నారు.
మండల స్థాయిలో ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, మెప్మా సభ్యులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, సీడీపీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలలో అవగాహన కల్పించి జాతీయ నులిపురుగుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఅర్వో విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిడ్పీ సీఈవో రాంరెడ్డి, డీఅర్డీవో కౌసల్యాదేవి, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.