ఖిలావరంగల్, జూన్ 30: గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుదని పేర్కొన్నారు. జిల్లాలో 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 28,819 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నట్లు తెలిపారు. చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జిగా వరంగల్ ఆర్డీవోను నియమించామని వెల్లడించారు. ఖిలావరంగల్ మండలం కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 15 రూట్ మార్గాలు ఉన్నాయని, ఇందుకు రెండు టీముల్లో 30 మంది రూట్ ఆఫీసర్లు, 76 మందిని ఐడెంటిఫై అధికారులుగా, 76 మందిని లైజన్ ఆఫీసర్లుగా నియమించామని వివరించారు. అంగన్వాడీ, ఆశ, మెప్మా, వీఆర్ఏలకు తనిఖీ బాధ్యతలు అప్పగించామన్నారు. రూట్ ఆఫీసర్ల నుంచి పోస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌ను స్వీకరించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆరు కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. వీటిని ముగ్గురు సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాల వరకు పరీక్ష సామగ్రిని రవాణా చేసే ప్రతి వాహనానికి పోలీసు ఎస్కార్ట్ ఉంటుందని, అలాగే పరీక్ష పూర్తయిన తర్వాత సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకురావానికి, టీఎస్పీఎస్సీ కార్యాలయం చేరుకునే వరకూ పోలీసు బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద తనిఖీ చేయడానికి ఐదుగురు పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా చేరుకోవాలని కోరారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 300 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయడంతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం గుర్తించిన ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. అభ్యర్థులు తీసుకొచ్చే ఫొటో గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌లోని సంతకాలు నామినల్ రోల్లో పెట్టే సంతకంతో సరిపోవాలని పేర్కొన్నారు. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో రాకపోతే ఆ అభ్యర్థి తమ మూడు ఫొటో గ్రాఫ్‌లు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి తీసుకురావాలని తెలిపారు. సెల్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని, ఎటువంటి ఆభరణాలు ధరించి రావద్దని కోరారు. అలాగే, అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకురావాలని సూచించారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే అభ్యర్థుల పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్ నంబర్, ప్రశ్నపత్రం నంబర్లు రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకదానికి రెండింటిలో బబ్లింగ్ చేస్తే చెల్లదన్నారు. ప్రశ్నాపత్రంపై సమాధానం టిక్ చేయకూడదని, అలా చేస్తే మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని సూచించారు. అలాగే, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా అభ్యర్థుల గుర్తింపు కోసం ఎడమ చేతి వేలిముద్ర తీసుకుంటామని స్పష్టం చేశారు. అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహిందీ పెట్టుకుంటే వేలిముద్రలు పడే అవకాశం తక్కువ ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు గమనించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్: నర్సంపేట పట్టణంలో శనివారం జరుగనున్న గ్రూప్-4 పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 25 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 10,400 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థులతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన ఏర్పా ట్లు చేశారు. సెంటర్ల వివరాలను అభ్యర్థులకు తెలిసేలా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచిస్తున్నారు. గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. లక్నేపల్లి బిట్స్ కళాశాలలో 360 మంది, బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 1886 మంది, బాలాజీ జూనియర్ కళాశాలలో 528 మంది, బాలాజీ టెక్నో స్కూల్లో 1008 మంది, ముగ్దుంపు రం జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో 480 మంది, మహేశ్వరం శివాణి పబ్లిక్ స్కూల్లో 504 మంది, సెయింట్ మేరీ హైస్కూల్లో 480 మంది అభ్యర్థులు గ్రూప్-4 పరీక్ష రాయనున్నారు. శుక్రవారం బిట్స్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ వాసం రామ్మూర్తి పరిశీలించారు.