ములుగు, జూలై 30 (నమస్తే తెలంగాణ) : అడవుల ఖిల్లా, పర్యాటక జిల్లాగా పేరున్న ములుగు మరిన్ని కొత్తందాలు అద్దుకుంటున్నది. జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాల ఆనవాళ్లు తెలిసేలా పలు ప్రధాన కూడళ్ల వద్ద అధికారులు థీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ విశిష్టతను తెలిపేలా నందీశ్వరుడి విగ్రహం, ఏనుగు, డమరుకం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్ కూడలి వద్ద ‘ఐ లవ్ ములుగు’ థీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తాడ్వాయి మండలం నార్లాపూర్-బయ్యక్కపేట కూడలి వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర ప్రాచుర్యాన్ని తెలిపేలా అమ్మ రూపమైన కుంకుమ భరిణ థీమ్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
వచ్చే జాతరలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు సంకల్పించారు. అనుకున్న సమయానికి ఇది పూర్తయితే దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కనువిందు చేయనుంది. దీంతో పాటు తాడ్వాయి మండల కేంద్రం నుంచి మేడారానికి వెళ్లే ఆర్చి వద్ద ఆదివాసీల జీవన విధానం, వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా ‘ఆదివాసీ బాణం సంధించే’ థీమ్ ఏర్పాటు కానుంది.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలి
– కలెక్టర్ టీఎస్ దివాకర
జిల్లాలోని ముఖ్య కూడళ్లలో చేపట్టిన సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులను ఆదేశించారు. బుధవారం గట్టమ్మ దేవాలయం, బండారుపల్లి, జంగాలపల్లి క్రాస్ రోడ్డు కూడళ్ల వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బండారుపల్లి కూడలిలో ‘ఐ లవ్ ములుగు’, గట్టమ్మ వద్ద మేడారం జాతరతో పాటు రామప్ప ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా సుందరీకరణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
నార్లాపూర్-బయ్యక్కపేట వద్ద, తాడ్వాయి ఆర్చి వద్ద కూడా ఆదివాసీల థీమ్ పనులు చేపట్టాలన్నారు. అలాగే జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, డీఈ ధర్మేందర్, ఇతర అధికారులున్నారు.
ఏర్పాటు చేయనున్న థీమ్‌లు
బండారుపల్లి రోడ్లో ఐ లవ్ ములుగు నార్లాపూర్ కూడలిలో కుంకుమ భరిణ తాడ్వాయి కూడలి వద్ద ఆదివాసీల సంస్కృతి