ఖిలావరంగల్, జనవరి 9: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని 80 మంది ఫిర్యాదులను కలెక్టర్ గోపికి అందజేశారు. పదేళ్లుగా ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్విర్తిస్తున్నామని, అలాంటిది తమకు నూతనంగా ఇచ్చిన నియామకపత్రాల ఆధారంగా నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వానికి, న్యాయశాఖకు విన్నవించుకుంటే సానుకూలంగా స్పందించిందని చింతల్ చంద్రవదనకాలనీకి చెందిన గడల రమేశ్‌తోపాటు మరో పది మంది కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
ఈనెల 27న ఎంజీఎం దవాఖాన అధికారులు విధుల రావద్దని మౌఖిక ఆదేశాలు జారీచేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్‌లో రేగడిమట్టిని రాత్రీ పగలు అనే తేడా లేకుండా కొందరు టిప్పర్లతో తరలిస్తున్నారని వల్లందాస్ కుమార్, కట్టా వీరభద్రయ్య, ఎన్నమనేని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. రిజర్వాయర్‌లోని రేగడి మట్టిని తొలగించడం వల్ల భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, అలాగే టిప్పర్లతో మట్టిని తరలిస్తుండడంతో రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దేశాయిపేటకు చెందిన గజ్జి దినకర్ పీఎంఈజీపీ లోన్ కావాలని దరఖాస్తు చేసినా ఇప్పటివరకు మంజూరు చేయలేదని, ఎల్డీఎంకు సిఫారసు చేసి లోన్ మంజూరు చేయించాలని వినతిపత్రం అందచేశారు.
ఖిలావరంగల్‌కు చెందిన అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు నాగవెళ్లి సారంగపాణి తనకు ఇంటి స్థలం కేటాయించి భవనం నిర్మాణం చేపట్టి ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఖోఖోలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించానని పేర్కొన్నాడు. తన తర్వాత వచ్చిన అంతర్జాతీయ ఖోఖో జట్టులోని క్రీడాకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని విన్నవించాడు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధిత, ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్లో వచ్చే దరఖాస్తులను పరిష్కరించి ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీవత్స కోట, ఆర్డీఓ మహేందర్‌తోపాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.