హనుమకొండ, జూన్ 7 : ప్రజలకు పారదర్శక సేవలందించాల్సిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రస్తు తం ప్రైవేట్ వ్యక్తుల అడ్డాలుగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ వడ్డేపల్లి 100 ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో కార్యాలయం లో సైతం ప్రైవేట్ వ్యక్తులే ఎకువ ప్రభావం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
ఏసీబీ అధికారుల దాడు ల నేపథ్యంలో ఇకడ విధులు నిర్వర్తించే ఇద్దరు సబ్ రిజస్ట్రార్లు సస్పెండ్ కావడంతో ఇన్చార్జి సబ్ రిజిస్టార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరు రూట్ మార్చి ప్రైవేట్ వ్యక్తులతో కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక డాక్యుమెంట్ రైటర్లు తీసుకొచ్చే ప్రతీ డాక్యుమెంట్‌కు రేట్ ఫిక్స్డ్ చేసి అనధికార వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రత్యేకించి ఓ రిజిస్ట్రర్‌ను సైతం నిర్వహిస్తున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం. రోజుకు సుమారు లక్షల రూపాయాలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు డాక్యుమెంట్ రైటర్లే చర్చించుకోవడం విశేషం.
గతంలో ఇదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి విధుల నుంచి తొలగించబడిన వ్యక్తి ప్రస్తుతం అనధికార వసూళ్ల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడు, అతని సన్నిహిత బంధువు, డాక్యుమెంట్ రైటర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆరోపణలున్నాయి. కార్యాలయంలో వీరి హవా కొనసాగుతోందని పలువురు ఉద్యోగులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు.
ఏసీబీ దాడులు జరిగిన సమయంలో డాక్యుమెంట్ రైటర్లు సబ్రిజిస్ట్రార్ల మధ్య జరిగిన ఫోన్ లావాదేవీలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్లు ఎకడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖలో పలు చోట్ల ఏసీబీ దాడులు జరిగి అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినా, స్థానికంగా మాత్రం పరిస్థితులు మారలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యాలయంలో జరుగుతున్న అనధికార వసూళ్లపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వరంగల్ ఆర్వో కార్యాలయంలో జరుగుతున్న అనధికార వసూళ్లకు సంబంధించి వివిధ రకాల డాక్యుమెంట్లకు ప్రత్యేక రేట్లు ఫిక్స్డ్ చేసినట్లు సమాచారం. మార్ట్గేజ్ డాక్యుమెంట్‌కు రూ.500, సేల్ డీడ్‌కు రూ. 1000, అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలకుపైగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సబ్ రిజిస్ట్రార్లు అనధికార వసూళ్లు చేస్తున్నట్లు కొందరు డాక్యుమెంట్ రైటర్లు చెప్పడంతో పాటు కార్యాలయ ఉద్యోగులు సైతం చర్చించుకోవడం గమనార్హం.
డాక్యుమెంట్ రైటర్లు సైతం ఈ డబ్బులను క్రయ, విక్రయ దారుల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చెల్లింపులు ఆలస్యమైతే అంతే ఆ డాక్యుమెంట్ చేతికి అందదనే విమర్శలు వినపిస్తున్నాయి. డాక్యుమెంట్ రకాన్ని బట్టి ముందే రేట్లు నిర్ణయించి వసూలు చేస్తున్నారని, కార్యాలయంలో రోజువారీగా జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్యను బట్టి ప్రతిరోజు లక్ష రూపాయలకు పైగా అనధికార వసూళ్లు జరుగుతున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చే ప్రజల అమాయకత్వం, సమయాన్ని ఆసరాగా చేసుకుని డాక్యుమెంట్ రైటర్లు ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవ్వరూ లేరు. నాలుగైదు రోజుల క్రితం కూడా నన్ను వేరే వారు ఇలాగే అడిగారు. అన్ని పారదర్శకంగానే చేస్తున్నాం. వసూళ్లు గతంలో జరిగాయని తెలిసింది. విచారణ చేసి తెలుసుకుంటాం.
– బీ సైదులు, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్