కృష్ణకాలనీ, ఏప్రిల్ 21 : తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని, తానే రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి ఏసీ గదుల్లో కూర్చొని పగటి కలలు కంటున్నాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో ఆయనకు డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర మాట్లాడారు. యాక్సిడెంటల్‌గా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, ఆయన పాలనను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసిఆర్ రావాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు.
కాంగ్రెస్ విధానాలు, సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 రోజుల ముందే కేసీఆర్ జగిత్యాలలో భారీ సభ పెడతానని నిర్ణయిస్తే భయపడిన రేవంత్‌రెడ్డి భూపాలపల్లి జిల్లాలో రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సభను పెట్టాడని విమర్శించారు. కేసిఆర్ పాలనలో యాసంగికి ముందే రైతుబంధు వేసేవారని, ఇప్పుడలా చేయకుండా సీఎం రైతులను నిండా ముంచుతున్నాడన్నారు.
ఊరూరికి బస్సులు పంపించి మహిళలపై ఒత్తిడి తెచ్చినా సీఎం సభకు ఎవరూ పోలేదని, ఎంత గట్టిగా ప్రసంగించినా ప్రజల నుంచి స్పందన లేదన్నారు. మఎన్నికలెప్పుడు పెట్టినా బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిందని, రైతులు పదేండ్ల పాటు రెండు నుంచి మూడు పంటలు పండించుకున్నారన్నారు. మేడిగడ్డను మరమ్మతు చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని కక్షగట్టిన రేవంత్ రెండున్నరేండ్లుగా రైతులకు సాగు, తాగునీరు అందించకుండా నిండా ముంచాడన్నారు.
మేడిగడ్డపై కుట్రలు మాని రైతులకు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. గత ఫిబ్రవరిలో భూపాలపల్లికి వచ్చిన సీఎం బైపాస్కు నిధులు కేటాయించానని చెప్పారని, మరి పనులెందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. భాసర్గడ్డలోని డబుల్ బెడ్రూం సముదాయంలో మౌలిక వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించడం ఖాయమని గండ్ర అన్నారు. సమావేశంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ మేకల సంపత్ కుమార్, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు పూర్ణచందర్, శ్యామల, నరేందర్, సతీశ్‌కుమార్, మంజుల, ఈశ్వరమ్మ, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్లు రవికుమార్, మురళీధర్, నాయకులు బుర్ర సదానందం, పిల్లి వేణు, నారాయణ, ప్రేమ్‌కుమార్ బాలరాజు, కరీం, శ్రీనివాస్, జుమ్ములాల్, తిరుపతి, రాజు పాల్గొన్నారు