మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమై, ప్రాణ, ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో సీఎం మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరిన రేవంత్‌రెడ్డి.. డోర్నకల్, మహబూబాబాద్, కురవి మీదుగా పురుషోత్తమాయగూడెం చేరుకున్నారు.
అకడ కొట్టుకుపోయిన బ్రిడ్జిని, రోడ్డును పరిశీలించారు. అకడున్న అధికారులతో మాట్లాడారు. అకడే కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ ఎలా గల్లంతయ్యారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పకనే ఉన్న సీతారాంతండాకు చేరుకున్నారు. అకడ వరదల్లో మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అధైర్యపడకండి అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లారు. వరద నష్టంపై అకడ జిల్లా పౌర సంబంధాల అధికారి ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు చేయాల్సిన పనులు త్వరగా పూర్తిచేయాలని, రోడ్ల మర మ్మతు పనులు తా తాలికంగా పూర్తి చే సి రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామని, జిల్లాలో వరదలతో ఇద్దరు మృతిచెందారని, చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. సీతారాంతండాతో పాటు మరో రెండు తండాలకు ఒకే చోట ప్రభుత్వం స్థలం ఇచ్చి అం దులో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇ చ్చారు. వరదతో జిల్లాలో 30వేల ఎకరాల్లో పం ట నష్టం జరిగిందని, దెబ్బతిన్న పంటలకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం అందిస్తానని ప్రకటించారు.
పశు నష్టం, పంట నష్టం ఇతర వాణిజ్య పంటల నష్టంపై ప్రత్యేక సర్వే నిర్వహించి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చా రు. ఆకేరు వాగు పొంగి ఇండ్లలోని పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి కొత్త వంతెన ని ర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో పం ట నష్టం జరిగిందని తెలిపారు. 680మందికి పునరావాసం కల్పించామని సీతారాంతండా లో వరద సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఎస్సై నగేశ్‌కి అభినందనలు తెలిపారు. సమీ క్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక, సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రూనాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరద నష్టం రూ.కోటీ 50 లక్షలు
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3 : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వరదలు, వాగులు పొంగిపొర్లుతుండటంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఆర్టీసీకి నష్టం వాటిల్లింది. మహబూబాబాద్‌తో పాటు వరదలు వస్తున్న ఆయా రూట్లలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా బస్సులను నిలిపివేశారు. మహబూబాబాద్-ఖమ్మం, తొర్రూరు, కేసముద్రం వైపు బస్సులను నిలిపివేయగా సుమారు 16 బస్సులు రద్దు చేశారు. భారీ వర్షాలతో మూడు రోజులకు రూ.కోటీ 50 లక్షల ఆదాయం నష్టపోయినట్లు ఆర్ఎం విజయభాను తెలిపారు.
సీరోలు ఎస్సై పుణ్యమాని బతికిన..
కురవి, సెప్టెంబర్ 3 : నాకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. అందరి పెండ్లిళ్లు చేసినం. మా పక్క ఇంట్లో రెండో కొడుకు భీముడు ఉంటాడు. నాకు కాళ్లు విరిగి అతుక్కొని నడిచే సమయంలో ప్రమాదవశాత్తు కుడికాలుపై వేడినీళ్లు పడ్డాయి. మళ్లీ మంచానికే పరిమితమయ్యాను. మా ఆయన బీక్యాకు నరాల నొప్పులు. పోయిన శుక్రవారం (ఆగస్టు 30న) వరంగల్‌లోని దవాఖానకు వెళ్లి వచ్చాడు. మా ఇల్లు తండా ప్రారంభంలో ఆకేరు వాగుకు సమీపంలో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున కరెంటు లేదు. నీళ్లు వస్తున్నాయని మా ఆయన చెప్పడంతో బయటకు వెళ్లేందుకు తలుపు తీశాం.
సముద్రంలో ఉన్నట్లుగా నీళ్లు నెట్టేశాయి. మా ఆయన, నేను ఇద్దరం మా గది నుంచి ఇంటి ముందు చెట్టు వరకు కొట్టుకుపోయాం. అదే సమయంలో భీముడు చూసి ముందు నన్ను, తర్వాత మా ఆయనను తీసుకొని డాబాపైకి చేర్చాడు. 10 గంటలు నరకం చూశాం. బతికుంటామనే ఆశ లేదు. ఎలాగో సమాచారం అందుకున్న పోలీసులు తండాను ఖాళీ చేయించిన తర్వాత చివరగా మా ఇంటికివచ్చారు.
సీరోలు ఎస్సై పుణ్యం.. జోలె కట్టి.. నన్ను మోసుకుంటూ రోడ్డు వరకు తీసుకుపోయిండు. నిజంగా ఆ సార్ దేవుడు. మా ఇంటి నుంచి రోడ్డు సుమారు కిలోమీటరు ఉంటది. అది కూడా నాటువేసిన వరిపొలాలు…నిండా నీళ్లు. అందులో నుంచే తీసుకుపోయిండు. దేవుడి దయతో సార్ చల్లంగా ఉండాలి.
– గుగులోత్ ద్వాలీ, సీతారాంతండా, మరిపెడ
పగోడికి కూడా మా కష్టం రావొద్దు
కురవి, సెప్టెంబర్ 3 : ఆదివారం వచ్చిన వరద జీవితంలో మళ్లీ చూడం. శనివారం రాత్రి వర్షం పడుతుండడంతో కరెంటు పోయింది. అందరం వరండాలోనే నిద్రపోయాం. తెల్లవారుజామున 2గంటల సమయంలో మేకలు, గొడ్లు అరుస్తుంటే ఏమైందనుకొని నిద్రలో నుంచి లేచి చూశాం. ఏం జరుగుతుందో తెలిసే సరికే నీళ్లు పెరిగిపోతున్నాయి. పై భాగాన ఉన్న ఇంట్లో అన్న ప్రకాశ్, వదిన కవిత, పాప పడుకున్నారు. కింద భాగాన ఉన్న ఇంట్లో నేను నా భార్య నీల, ఇద్దరు కుమారులు, అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ బాలి పడుకున్నాం. కళ్లుమూసి తెరిచే సరికి నడుము వరకు నీళ్లు వచ్చాయి. అమ్మను తీసుకువెళ్లి పక్కనే ఉన్న మా బాబాయి ఇంటి మీదకు చేర్చి పిల్లలను తీసుకుని వెళ్లే సరికి కిందకు వచ్చే పరిస్థితి లేదు.
తెల్లవారుజామున 3 గంటలకు ఎక్కిన డాబా దిగేసరికి 11 గంటలైం ది. ఎనిమిది గంటలు నరకయాతనే. పోలీసులు, లచ్యాతండావాసులు మమ్ముల్ని కాపాడారు. ఆ సమయంలో నిద్రలోనుంచి మెళకువ రాకపోయి ఉంటే ఎనిమిది మందిమి శవాలుగా మారేటోళ్లం. ఇటువంటి కష్టం పగోడికి కూడా రావొద్దు. ప్రభుత్వం స్పందించి తండాను ఖాళీ చేయిస్తేనే మా పిల్లలకు భవిష్యత్ ఉంటుంది. తినేందుకు తిండి గింజలు లేవు. రెండు దుక్కిటెద్దులు నీళ్లలో పోయాయి. 10 శాల్తీల మేకలు కొట్టుకుపోయాయి. పంట పొలాలను చూసేందుకు మనసు రావడంలేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నం.
– గుగులోత్ రవి, సీతారాంతండా, వ్యవసాయ రైతు