మహబూబాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ) : అధైర్యపడకండి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీతారాంతండావాసులకు భరోసానిచ్చారు. మంగళవారం ఖమ్మం జిల్లా నుంచి డోర్నకల్, కురవి మీదుగా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఇటీవలి వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి ముందు రోడ్డును సీఎం పరిశీలించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడి, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత అక్కడినుంచి సీతారాం తండాకు చేరుకొని వరద బాధితులతో మాట్లాడి వారు పడిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం : అమ్మా మీ పేర్లేంటి?
బాధితులు : ఇస్లావత్ మంగీలాల్, నా భార్య పేరు కవిత.
సీఎం : మీకు ఏం నష్టం జరిగింది?
మంగీలాల్ : అర్ధరాత్రి వరద వచ్చింది. ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఇళ్లలోకి నీళ్లు రాగానే డాబాపైకి ఎక్కి కూర్చున్నం. ఆదివారం మధ్యాహ్నం వరకు వరద తగ్గలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం.
సీఎం : వరద వల్ల మీకు ఏం నష్టం జరిగింది?
మంగీలాల్, కవిత : ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కొట్టుకుపోయాయి.
సీఎం : ఏమేమి వస్తువులు పోయాయి?
మంగీలాల్-కవిత : రూ.80వేల నగదు, మూడు తులాల బంగారం, పాసుపుస్తకాలు, పిల్లల సర్టిఫికెట్స్, పుస్తకాలు, బట్టలు అన్నీ కొట్టుకుపోయాయి. నిత్యావసర సరుకులు అయిన బియ్యం, ఉప్పు, అన్ని రకాల సరుకులు వరద పాలయ్యాయి.
సీఎం : ఇప్పుడు మీకు ఏం కావాలి?
మంగీలాల్-కవిత : మాకు ఇల్లు ఇక్కడ వద్దు. నీళ్లు రాని కాడ కట్టిచ్చి ఇవ్వండి, ఇక్కడ అసలే ఉండలేం సార్.
సీఎం : ఈ ఇల్లు మీ సొంతంగా కట్టుకున్నారా? ప్రభుత్వం ఇచ్చిందా?
మంగీలాల్-కవిత : మేమే కట్టుకున్నం సార్.
సీఎం : మీకుఎంతమంది పిల్లలు? ఏంచదువుతున్నారు?
మంగీలాల్-కవిత : మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.
సీఎం : ఏం చదువుతున్నారు?
మంగీలాల్-కవిత : పెద్ద కూతురు సొనాలిక ఇంటర్ సెకండియర్, రెండో కుమార్తెగాయత్రి 8వతరగతి, కుమారుడు వీరభద్రం నాయక్ 6వ తరగతి చదువుతున్నారు సార్.
సీఎం : నీ పేరు ఏంది బాబు.. మంగీలాల్, కవితల కొడుకును అడిగాడు
వీరభద్ర నాయక్ : నా పేరు వీరభద్రం నాయక్ సార్.
సీఎం : ఏం చదువుతున్నావు నీవు
వీరభద్రం నాయక్ : 6వ తరగతి సార్. నా బుక్స్ అన్నీ తడిసి పనికి రాకుండా పోయాయి.
సీఎం : ఈమె ఎవరో తెలుసా? (పక్కన ఉన్న సీతక్కను చూపిస్తూ)
వీరభద్రం నాయక్ : తెలుసు సార్. సీతక్క.
సీఎం : ఈ అక్క నీకు పుస్తకాలు, కాపీలు అన్ని కొనిస్తుంది. నువు బాగా చదువుకో డాక్టర్ కావాలి.
వీరభ్రద్ర నాయక్ : అలాగే సార్.
సీఎం : పక్కనే ఉన్న కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను పిలిచి ఈ తండావాసులకు మొత్తం మంచి స్థలం చూసి అందులో ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.