సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం చేకూర్చాలని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని బుధవారం ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ముడుపులు కట్టి పూజలు చేశారు. అనంతరం తరిగొప్పుల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని బీడు భూములకు గోదావరి జలాలు తరలించి సస్యశ్యామలం చేశామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం చేకూర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తరిగొప్పుల, అక్టోబర్ 18 : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బొంతగట్టునాగారంలో ఏడు పోచమ్మల ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలతో కలిసి నృత్యాలు, కోలాటాలతో ర్యాలీగా వెళ్లారు. బొంతగట్టునాగారం, బొత్తలపర్రె, కొత్తతండా, మాన్సింగ్తండా, వాచ్యతండా, బంజర్‌పల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఓటు అడిగారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. పదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, బీడు భూములకు గోదావరి జలాలు తరలించిన వివరాలు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని విపక్షాలు బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్కు పట్టంగట్టి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అంకుషాపుర్ గ్రామంలో అభివృద్ధి పనులను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎంపీపీ జొన్నగోని హరిత సుదర్శన్ గౌడ్, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ అర్జుల సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలివేరు లింగం, మండల కోఆర్డినేటర్ జొన్నగోని కిష్టయ్య గౌడ్, సర్పంచ్‌లు దామెర ప్రభుదాస్, ఇరుమల్ల బాలమణి, భూక్యా తిరుపతి, ముక్కెర బుచ్చిరాజ్ యాదవ్, ఎంపీటీసీలు అర్జుల మధుసూదన్ రెడ్డి, భూక్యా జూంలాల్ నాయక్, నాయకులు తాళ్లపల్లి పోషయ్య, భూస యాదయ్య, వంగ బీమయ్య, నూకల కృష్ణమూర్తి, పోగుల అశోక్, పోగుల చంద్రమౌళి పాల్గొన్నారు.
జనగామ, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : జనగామ పట్టణ శివారులోని యశ్వంతాపూర్ ఎల్లమ్మ ఆలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి దర్శించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి వెళ్లిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో చెట్టుకు కొబ్బరికాయ ముడుపులు కట్టారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీపార్టీ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి రెండుసార్లు ఎల్లమ్మ ఆలయంలో పూజ లు చేసి ఘనవిజయం సొంతం చేసుకున్న సెంటిమెంట్‌తో పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం ఇక్కడ తొలిపూజ చేసిన తర్వాతనే తరిగొప్పులలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.
యశ్వంతాపూర్ ఎల్లమ్మతల్లి దీవెన.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వాదం..పెద్దన్న ముత్తిరెడ్డి సహకారం..సకల నాయకులు, కార్యకర్తల మద్దతు..ప్రజాబలంతో తనను జనగామ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని అమ్మవారికి పూజలు చేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ తీసుకొచ్చిన అద్భుతమైన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో సమావేశాలు, ప్రచారంలో చెబుతానన్నారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చెబుతా..అభివృద్ధిని కొనసాగిస్తానని చెబుతా..ఐదేళ్లలో నేను ఏం చేయగలుగతాననేది చెబుతా అన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎల్లమ్మ తల్లి దీవెనతోనే నేను రెండుసార్లు భారీ మెజార్టీతో గెలుపొందాని..మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రెట్టింపు ఓట్లతో గెలుపు ఖాయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పల్లా బతికున్నంత వరకు అమ్మ ఆయనను గెలిపిస్తనే ఉంటది..ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే జనగామ నియోజకవర్గం నుంచి కనీవినీ ఎరుగని మెజార్టీని ఇక్కడి ప్రజలు ఇవ్వబోతున్నారు. అమ్మ దీవెన..కేసీఆర్ ఆశీస్సులు..ప్రజాప్రతినిధుల అండతో గెలిచి జనగామ చరిత్ర తిరగరాబోతున్నదని అన్నారు. మాకు ఎమ్మెల్యే ఉన్నడనే ధైర్యం నమ్మకంతో ప్రజలు కంటినిండ నిద్రపోతారని..తమ్ముడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గ బాధ్యత మోయబోతున్నారని అన్నారు.