వరంగల్, ఆగస్టు 7 : గ్రేటర్ వరంగల్‌లో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం నగర ప్రజాప్రతినిధులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్ వరద నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీధర్ నేతృత్వంలో అధికారుల బృందం నగరంలోని నాలాలను పరిశీలించింది. వరదలకు కారణాలు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేస్తామని వెల్లడించింది. భాగ్యనగరంలో వ్యూహాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ తరహాలో ఇక్కడా చర్యలు చేపడతామని ఈఎన్సీ శ్రీధర్ చెప్పారు.
వరంగల్ నగరంలో వరద ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికల వైపు అడుగులు పడుతున్నాయి. ఇటీవల కురిసన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగర ప్రజాప్రతినిధులతో వరద ముంపు నివారణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సోమవారం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీధర్ నేతృత్వంలో అధికారుల బృందం నగరంలోని నాలాలను పరిశీలించింది. ఇటీవల వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించింది. జవహర్‌నగర్ కాలనీ, కేయూ 100 ఫీట్ల రోడ్డు, నయీంనగర్ నాలా, పోతన నగర్, బొందివాగు, బీఆర్‌నగర్, కాశికుంట, నాగేంద్రనగర్, మైసయ్యనగర్, ఎస్ఆర్ నగర్ నాలా, కట్టమల్లన్న చెరువు, చిన్న వడ్డేపల్లి నాలా, 12 మోరీలు, పెద్దమ్మగడ్డ నాలా, ములగు రోడ్డు నాలాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతం కావడంతో ఇటీవల వర్షాలకు ఆ నగరం ముంపునకు గురికాలేదు. దీంతో వరంగల్ నగర ప్రజాప్రతినిధులు ఇక్కడ కూడా ఎస్ఎన్డీపీ చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీంతో స్పం దించిన ఆయన వెంటనే ఈఎన్సీ నేతృత్వంలో బృందాన్ని నగరానికి పంపించారు. క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలు, నగర నాలాలను ఈ బృందం సభ్యులు పరిశీలించారు.
త్వరలోనే ప్రత్యేక మాస్టర్ ప్లాన్
వరంగల్ నగర ముంపు నివారణ కోసం త్వరలోనే దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈఎన్సీ శ్రీధర్ అన్నారు. నగరంలోని నాలాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు వరద ముంపు నుంచి ఉపశమనం కలిగే లా ప్రణాళికలు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వ్యూహాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ తరహాలో వరంగల్ నగరంలో చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో త్వరలోనే ప్రణాళికలను ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాం చేపట్టిన సంస్థతో కలిసి వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. 2020-2022, 2023 సంవత్సరాల్లో వరదలు రావడానికి కారణాలు, పరిష్కార మార్గాలు, చేపట్టాల్సిన పనులపై పూర్తిస్థాయిలో అద్యయనం చేస్తామన్నారు. మరో పది రోజులు ఏజెన్సీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. కార్పొరేషన్ హయాంలో ఉన్న చెరువులు, గ్రేటర్‌గా ఆవిర్భవించిన తర్వాత ఉన్న చెరువులను పరిగణనలోకి తీసుకొని అప్పటి వర్షపాతం, ప్రస్తుత వర్షపాతం డాటాను అనుసంధానం చేసి నగర నాలాలు, డ్రైనేజీల మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని వివరించారు. వరంగల్ నగరంలో స్ట్రాటజికల్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాంను వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కాళోజీ కళాక్షేత్రం పనుల పరిశీలన
బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనుల పురోగతిని ఈఎన్సీ శ్రీధర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయాన్ని ఆయన అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో బల్దియా ఎస్సీలు ప్రవీణ్‌చంద్ర, కృష్ణారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్‌కుమార్, బల్దియా ఈఈలు శ్రీనివాస్, రాజయ్య, శ్రీనివాసరావు, స్మార్ట్‌సిటీ పీఎంవో ఆనంద్ ఓలేటి, బల్దియా కుడా, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.