మహబూబాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు పట్టణానికి చేరుకొని ముందుగా గిరిజన భవనం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, కలెక్టరేట్ ఆవరణలోనే కట్టిన ప్రజాగ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో ప్రసంగించి, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. భోజన విరామం అనంత రం మధ్యాహ్నం 1.30గంటలకు హెలిక్యాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తారు.
పట్టణం గులాబీమయం
సీఎం రాక కోసం మానుకోట పట్టణమంతా గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు రహదారి వెంట ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ను అందంగా తీర్చిదిద్దారు. లోపల, బయట భాగంలో పూలతో అలంకరించారు. భవనం మొత్తం రాత్రివేళ విద్యుత్ కాంతుల్లో మిరుమిట్లు గొలుపుతున్నది. కలెక్టరేట్ ఆవరణలో ప్రజాప్రతినిధుల గ్యాలరీలో టెంట్లు, షామియానాలు, కుర్చీలు వేశారు. కలెక్టర్ గదిని పూలతో అలంకరించారు. కలెక్టరేట్ సముదాయం పరిధిలో ఉండే ప్రతి గదిని సుందరంగా ముస్తాబు చేశారు. సీఎం కేసీఆర్ పయనించే రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఇప్పటికే గార్డెన్ ఏర్పాట్లు చేశారు. పార్టీ సమావేశ మందిరాన్ని సైతం అలంకరించారు. గ్రంథాయాన్ని సైతం విద్యుత్ లైట్లతో అలంకరించారు.

మంత్రుల పర్యవేక్షణ

సీఎం పర్యటన కోసం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ, బీఆర్ఎస్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సైతం మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్‌ను పరిశీలించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.
వెల్కం.. సీఎం కేసీఆర్ సర్
ముఖ్యమంత్రికి విద్యార్థుల ఆహ్వానం

కేసముద్రం, జనవరి 11: నర్సింహులగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ‘వెల్కం సీఎం కేసీఆర్ సర్’ అంటూ బుధవారం ముఖ్యమంత్రికి స్వాగత ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి నేడు మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేలా కార్డులపై గులాబీ పూల రేకులతో వెల్కం అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొడిపాక రమేశ్, పెరుమాండ్ల ప్రభాకర్ ఉన్నారు.

ముగ్గురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, 17 మంది డీఎస్పీలు
విధుల్లో 1600మంది సిబ్బంది
ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి
మహబూబాబాద్, జనవరి 11 : మానుకోటలో సీఎం పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఏబీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, 17మంది డీఎస్పీలు, 63మంది సీఐలు, 160మంది ఎస్ఐలు పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు, పికెటింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డాగ్, బాంబ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.
వాహనాల దారి మళ్లింపు
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాకేంద్రానికి వచ్చే వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూం వెనుక పార్కింగ్ స్థలం కేటాయించామన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, నెల్లికుదురు, తొర్రూరు నుంచి వాహనాలు నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం, ఈదులపూసపల్లి మీదుగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి నర్సంపేట బైపాస్, ఫూలే జంక్షన్, ైప్లె ఓవర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాలన్నారు. మరిపెడ, సీరోలు, కురవి నుంచి వచ్చే వాహనాలు సాలార్‌తండా, మొగిలిచర్ల నుంచి అనంతారం టెంపుల్ రైల్వేగేట్ నుంచి ఫ్లై ఓవర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాలని చెప్పారు. గూడూరు, బయ్యారం నుంచి వచ్చే వాహనాలు జ్యోతిరావుఫూలే జంక్షన్ నుంచి ఫ్లై ఓవర్ మీదుగా పార్కింగ్ స్థలానికి రావాలన్నారు. చిన్నగూడూరు నుంచి వచ్చే వాహనాలు సీపీఐ ఆఫీస్ నుంచి చివరి రైల్వేగేట్ మీదుగా ఎఫ్ఆర్వో సెంటర్, ఫూలే జంక్షన్ ఫ్లై ఓవర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాలన్నారు. మహబూబాబాద్ పట్టణం నుంచి వచ్చే వాహనాలు ముత్యాలమ్మ టెంపుల్, చివరి రైల్వేగేట్, ఫూలే జంక్షన్‌కు చేరుకుని ఫ్లై ఓవర్ మీదుగా రావాలన్నారు. వాహనాలను రహదారులపై ఆపవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఓవర్‌లోడ్‌తో నడుపరాదని చెప్పారు.
ఇల్లందు, బయ్యారం నుంచి మరిపెడకు వెళ్లే ప్రైవేట్ వాహనాలు అనంతారం గేట్ నుంచి మొగిలిచర్ల, సాలార్‌తండా మీదుగా వెళ్లాలని సూచించారు. గూడూరు నుంచి మరిపెడ వెళ్లే వాహనాలు నర్సంపేట బైపాస్ నుంచి ఫూలే విగ్రహం, ఆర్తి గార్డెన్ ముందు నుంచి అనంతారం గేట్, మొగిలిచర్ల నుంచి కురవి వైపు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహనాలను మూడుకొట్ల సెంటర్ నుంచి, ముత్యాలమ్మ సెంటర్, నెహ్రూ సెంటర్, అండర్‌బ్రిడ్జి, కురవి రోడ్డు వైపు అనుమతించబోమని వివరించారు. వాహనదారులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.