తొర్రూరు/ పెద్దవంగర, జనవరి10 : సీఎం కేసీఆర్ సభలకు జనం పోటెత్తాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 12న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, 18న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభకు గ్రామాల నుంచి జనం పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ మేరకు మంగళవారం తొర్రూరు క్యాంపు కార్యాలయం, పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. జన సమీకరణపై చర్చించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నదన్నారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.
చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటివెలుగు కార్యక్రమం అందరి ఇంటి వెలుగులా సాగేలా సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కంటి వెలుగు నిర్వహించే సెంటర్లలో సౌకర్యాల కల్పించాలన్నారు. నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిలో టూరిజం ఆధ్వర్యంలో రూ.25కోట్లతో హరిత హోటల్ నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వాలు చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాయని, సీఎం కేసీఆర్ పాలనలో వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
పాలకుర్తి నేల కవులకు పుట్టినిల్లుని, అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన అదృష్టమన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, వాల్మికి కవులు ప్రసిద్ధి చెందిన గ్రంథాలను రచించిన మహనీయులన్నారు. అలాంటి ప్రాంతాన్ని మరో బాసరగా తీర్చిదిద్దుతామన్నారు. 12న మానుకోటలో సీఎం కార్యక్రమానికి గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి పార్టీల బాధ్యులు, ప్రజాప్రతినిధులు ఎంతమంది హాజరవుతున్నారో వివరాలు ఇవ్వాలన్నారు. 18న ఖమ్మం బహిరంగ సభకు గ్రామాలు, అన్ని వార్డుల నుంచి సుమారు 10వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, అన్ని గ్రామాలకు బస్సులను పంపిస్తామన్నారు. తొర్రూరు మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ చిన్న అంజయ్య పాల్గొన్నారు.