‘నాడు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం సాధించి పెడితే.. సమైక్య పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నేటితరం గాంధీ మన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం జనగామలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డ్డి, రాజయ్యతో కలిసి మంత్రి జిల్లాలోని 314 మంది వీఆర్ఏలు, 10మంది జేపీఎస్‌లను వివిధ శాఖలకు కేటాయిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ సర్కారు గత నెల 24న జీవో 81 విడుదల చేసిందని, ఇకపై వారు పేసేల్ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు.
జనగామ, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ‘నాడు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం సాధించి పెడితే.. సమైక్య పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నేటితరం గాంధీ మన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధితోపాటు చిరు ఉద్యోగుల కష్టాలు, బాధలు తెలిసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. గురువారం జనగామలోని భ్రమరాంబ ఫంక్షన్హాల్లో జిల్లాలోని 314 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు), 10మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (జీపీఎస్‌లు) రెగ్యులరైజేషన్ పత్రాలు, వారికి రికార్డు, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ క్యాడర్లో వివిధ శాఖలను కేటాయిస్తూ నియామక పత్రాలను జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర సర్కారు గతనెల 24న జీవో 81 విడుదల చేసిందని, ఇకపై పేసేల్ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని చెప్పారు. జిల్లాలో రెగ్యులరైజేషన్ అయిన 314 మంది వీఆర్ఏలు, వారి కుటుంబాలు కేసీఆర్‌కు రుణపడి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్డర్స్ తీసుకున్న వీఆర్ఏలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పటేల్, పట్వారి వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దకిందని, భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపంగా కొనసాగుతున్న వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసి వేలాది కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించడం సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం నెలకు 3వేల రూపాయలతో కన్సాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్ఏల క్రమబద్ధీకరణ దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదని, గ్రామంలో ఏ ఇతరశాఖ అధికారి వచ్చినా వీఆర్ ఏలు అందుబాటులో ఉండేవారని, అయితే కొన్నేళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడ్డారని, వారి శ్రమను గుర్తించి పేసేల్ విధానాన్ని అమలు చేయడంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. వీఆర్ఏల రెగ్యులరైజ్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయడంపై చిరుద్యోగుల్లో సంబురం అంబరాన్నంటిందని, పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాల్లో వెలుగు నింపిందనారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 60ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు కూడా రెగ్యులరైజ్ విధానంలో విద్యార్హతలను బట్టి అవకాశం కల్పించడం గొప్ప విషయమని, పైగా అందరినీ ఆయా శాఖల్లో సర్దుబాటు చేయడం, ఇప్పుడు ఆర్డర్లు మీకు దకడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.
మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని, ఇంత గొప్ప అవకాశం కల్పించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటూ, సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞతలు చాటుకుంటూ అండగా నిలవాలని కోరారు. గృహలక్ష్మి, రూ.లక్ష రుణసాయం, రుణమాఫీ వంటి అనేక పథకాలను అమలు చేస్తుండడంతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతున్నదని పేర్కొన్నారు. అధికారంపై వారి ఆశలు అడియాషలు కావడం ఖాయమన్నారు. ‘మీకు భవిష్యత్ కల్పించి, మీ కుటుంబాలకు అండగా నిలిచిన కేసీఆర్‌కు మనమంతా అండగా నిలుద్దాం’ అని అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అందరికీ న్యాయం, అనేక మంది ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నారని తెలిపారు. దేశం యావత్ తెలంగాణ వైపు చూసేలా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని మళ్లీ కాపాడుకునేందుకు అన్నివర్గాల ప్రజలు సమాయత్తం అవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీ సీతారాం, జిల్లా అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్, వీఆర్ఏల అసోసియేషన్, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి వీఆర్ఏలు, జీపీఎస్‌లు పుష్పాభిషేకం చేశారు.
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేయడం అభినందనీయం
జనగామ చౌరస్తా: వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా షరీఫ్, పెండెల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులకు శాశ్వత నియామక పత్రాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్యను సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం జిల్లాలో 30 ఎకరాలు కేటాయించాలని ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా నాయకులు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పం దించినట్లు వారు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా, పట్టణ నాయకులు చింత రాంనర్సయ్య, సంపత్, శ్రీధర్, నాగార్జున, ప్రభాకర్, నర్సయ్య, బందవరపు రాజేశ్ పాల్గొన్నారు.