పోచమ్మమైదాన్(కాశీబుగ్గ), డిసెంబర్ 23 : ‘రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానిది ముమ్మాటికీ కక్షసాధింపే. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు నానా యాగి చేస్తున్నారు. ఉపాధి హామీ నిధుల నిలిపివేత సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ తెలంగాణ అభివృద్ధికి నయా పైసా తీసుకురాని కాషాయ నేతలను గ్రామాల్లో అడ్డుకోవాలి.’ అని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. ఇక్కడి రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఓ సిటీ మైదానంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ర్టానికి నోటీసులు ఇవ్వడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. దేశంలోనే రైతుల సంక్షేమం కోరే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. రైతుబంధు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రైతుల నడ్డి విరిచేందుకే కల్లాలపై మోదీ సర్కారు కత్తి దూస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం ఓ సిటీ మైదానంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధి చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కల్లాలను చూసి బీజేపీకి కడుపు మండుతోందని విమర్శించారు. కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ర్టానికి నోటీసులు ఇవ్వడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. పథకాన్నే నీరుగార్చే విధంగా అనేక షరతులు, కోతలను కొత్తగా చేర్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రైతును రాజును చేయాలని సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తుం టే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్పొరేట్ కంపెనీలతో కలిసి మోదీ సర్కారు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నదని ఆరోపించారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. దేశంలోనే రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. రైతులకు మేము ఎ లాంటి సాయం అందించం.. రాష్ట్రం కూడా చేయొద్దన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న సంకల్పంతోనే రెండున్నర ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు. రెండు పంటలకు నీరు అందించడంతో పాటు రైతులు అప్పుల ఊబి నుంచి బయటకు రావాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్షతో దేశ చరిత్రలోనే తొలిసారి రైతులకు నేరుగా నగదు అందించే రైతు బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. మొదటి నుంచి రైతుల పక్షపాతిగా ఉంటున్న బీఆర్ఎస్కు కేంద్రం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి అనేక సదుపాయాలు కల్పిస్తూ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. వరి వేయొద్దని మెలిక పెట్టి సాగు విస్తీర్ణం తగ్గించే కుట్రలు పన్నిన కేంద్రం తాజాగా ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న కల్లాలపై కత్తి కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, జన్ను షీభారాణి, సంగెం జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, గంధం గోవింద్, గండ్రాతి భాస్కర్, నేరెళ్ల రాజు, ఇట్యాల శిరీషా, ఎంపీపీలు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉరితాళ్లతో వినూత్న నిరసన..
గిర్మాజీపేట : తెలంగాణ రైతులపై వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని నినదిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి ఉరితాళ్లతో వరంగల్ చౌరస్తాలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మంచి చేస్తే ఓర్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంట కల్లాల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు వాడొద్దంటూ కొర్రీలు పెట్టడం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ప్రధాని మోదీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులు లింగాల ఓదెలు, అంబిరు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.