హనుమకొండ, అక్టోబర్ 30 : ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దివ్యాంగులందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల సంఘం నాయకుడు లింగుదారి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి దివ్యాంగ పింఛన్ లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రశ్‌లో దివ్యాంగులు అనేక కష్టాలు పడ్డారన్నారు. వారికి ఇచ్చే పింఛన్‌తో పాటు, ఇతర సమస్యల సాధన కోసం అప్పటి ఎమ్మెల్యేగా తాను కాళోజీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అండగా నిలిచారన్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ ముందుగా పింఛన్‌ను ఒకేసారి రూ. 2వేలకు పెంచారన్నారు. ఆ తర్వాత మళ్లీ రూ.3వేలకు పెంచి, మొన్న రూ. 4016 చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.6వేలకు పెంచుతామని తెలిపారు. అంతేకాకుడా దివ్యాంగులకు గృహలక్ష్మి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందరి ఆశీర్వాదంతో నాలుగు సార్లు గెలిచానని, ఇప్పుడు కూడా మీరంతా ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకంతో కేసీఆర్ బీఫామ్ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు దిక్చూచి సీఎం కేసీఆర్ అని దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పింఛన్లు పెంచడమే కాకుండా డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తొమ్మిదేళ్లలో దివ్యాంగుల పింఛన్లకు దాదాపు రూ.10,300 కోట్లు కేటాయించారని తెలిపారు. గతంలో దివ్యాంగులకు 30 శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందజేస్తే తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేస్తోందన్నారు. అలాగే, వివాహ ప్రోత్సాహక బహుమతిని కూడా రూ.1.25లక్షల నుంచి రూ.2.25లక్షలకు పెంచినట్లు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపిన బీఆర్ఎస్ పార్టీకి అందరూ అండగా ఉండి మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరంపలువురు దివ్యాంగులకు దాస్యం వినయ్ భాస్కర్ భోజనం వడ్డించి, వారితో కూర్చుని భోజనం చేశారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజ్, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ప్రచార నిర్వహణ కమిటీ ఇన్చార్జి మర్రి యాదవరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు విజయలక్ష్మి, మానస, వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, వికలాంగుల విభాగం నాయకులు నడిపల్లి శ్రీధర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, నలబోల సతీశ్, రాంప్రసాద్, దివ్యాంగులు పాల్గొన్నారు.