దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాతకు నిజమైన గౌరవాన్నిచ్చారని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. దేశ జనుల కోసం జీవితాంతం కృషి చేసి, విశ్వమానవుడిగా నిలిచిన బాబాసాహెబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత స్థానాన్ని ఇస్తున్నదని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ఏటా అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు ప్రదానం చేయాలని సీఎం నిర్ణయించడం, ఇందుకోసం రూ.51 కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని స్పష్టం చేస్తున్నారు. తాము కేంద్రంలో అధికారం చేపట్టి దేశమంతా దళిత బంధును అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని నిండు మనసుతో స్వాగతిస్తున్నారు.
హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే చారిత్రక ఘట్టంగా నిలిచిందని, రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తిని మరోసారి యావత్ ప్రపంచానికి చాటిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని, అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని స్పష్టం చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఉందని, దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొంటున్నారు. దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, ఈ పథకాన్ని దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రకటనతో దేశంలోని దళిత సామాజిక వర్గానికి చెందినవారంతా కేసీఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారని స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరిట ఏటా అవార్డులు అందించాలని నిర్ణయించడం, ఇందుకోసం రూ.51కోట్లతో శాశ్వత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం శుభపరిణామన్నారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటుకావడం గర్వంగా ఉందని, అంబేద్కర్ జయంతిని విశ్వవిజ్ఞాన దినోత్సవంగా ఐక్య రాజ్యసమితి ప్రకటించడం ఒక ఎత్తయితే, 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం మరో ఎత్తు అని కొనియాడుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా అంబేద్కర్ మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 15
కృష్ణకాలనీ, ఏప్రిల్ 15 : హైదరాబాద్ మహా నగరంలో చారిత్రక మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. హుస్సేన్ సాగర్ తీరాన దేశంలోనే 125 అడుగుల ఎత్తుతో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అంతే కాకుండా పక్కనే అంబేద్కర్ పేరుతో తెలంగాణ సచివాలయం నిర్మించడం గొప్ప విషయం. అఖిల భారత ప్రజానికానికి ఆశాదీపం అంబేద్కర్ విగ్రహం. రాజ్యాంగ శిల్పి అని తెలిసేలా పార్లమెంట్ భవనం ఆకారంలో 50 అడుగుల పీఠం, దానిపై అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. భారత జాతికి వెలుగులు పంచిన మహర్షి అంబేద్కర్ విగ్రహం పరిశోధకులకు సాక్ష్యంగా, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయంగా, పర్యాటకులకు ఆకర్షించే ప్రదేశంగా, బౌద్ధువులకు పుణ్యక్షేత్రంగా, భారతీయులకు పవిత్ర దేవాలయంగా నిచిలిపోతుంది. మానవత్వానికి మారుపేరు, హింసను వ్యతిరేకించే అంబేద్కర్ రూపాన్ని అపురూప శిల్పంగా మలిచి, దేశ ప్రజలందరికీ అంబేద్కర్ మార్గం అవసరమనే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, నిజాయితీకి మారుపేరైన రాజకీయ నేత. స్వాతంత్య్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి, 64 మాస్టర్ డిగ్రీ పట్టాలను పొంది డాక్టరేట్ గౌరవాన్ని సంపాదించి అధ్యాపకుడిగా, ఆర్థిక వేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్వేచ్ఛ, సమానత్వపు గొంతుకగా రాజ్యాంగ నిర్మాణం కోసం కష్టపడ్డారు. ఒకప్పుడు హైదరాబాద్‌కు సింబల్‌గా చార్మినార్, తర్వాత హుస్సేన్ సాగర్ బుద్ధుడు.. నేడు అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ గుర్తు వచ్చే సింబల్‌గా మారింది. సీఎం కేసీఆర్ దళితులకు పెద్దపీట వేశారు. వారిలో ఆత్మాభిమానం పెంచారు.
– దుప్పటి మొగిళి, కవి, రచయిత, దళిత మేధావి
కాజీపేట, ఏప్రిల్ 15 : హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం అభినందనీయం. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతోంది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారానే ఆర్థిక సాయం చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేస్తూ, వారికి లాభదాయక యూనిట్లను పంపిణీ చేస్తున్నారు. కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధికారంలోకి వస్తే దళితులందరికీ దళిత బంధు పథకం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించడం సంతోషకరం. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం. అదేవిధంగా ఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. అంబేద్కర్ పేరు పెట్టాలి. అప్పుడే రాజ్యాంగ నిర్మాతకు సముచిత స్థానం కల్పించినట్లవుతుంది.
– దర్శనాల మొగిలయ్య, ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, దర్గా కాజీపేట
కృష్ణకాలనీ, ఏప్రిల్ 15 : హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారు. గత వారం రోజుల నుంచి దేశమంతా ఇదే చర్చ. చాలా గర్వంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా అంబేద్కర్ గొప్పతనం గురించి సమాజానికి తెలియజేసిన నాయకుడు లేడు. దేశ వ్యాప్తంగా కులవివక్ష, అంటరానితనం పెరిగిపోతున్నది. దేశాన్ని పాలిస్తున్న నాయకులు అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ధైర్యం చేసి, దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పుతో అతి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దేశంలోని దళితులంతా గర్వపడేలా చేసిండు. దేశంలో కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించే వారు ఇప్పటికైనా అంబేద్కర్ గొప్పతనాన్ని తెలుసుకోవాలి.
– ఓనపాకల రాజయ్య, బీఆర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత
నల్లబెల్లి, ఏప్రిల్ 15 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించడం చారిత్రక ఘట్టం. ఇందుకు ఎనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిచిలిపోతారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులు మారినా ఇంతటి బృహత్తర కార్యక్రమం ఏ ఒక్కరూ చేపట్టకపోవడం బాధాకరం. దళితజాతి అభ్యున్నతిపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి మరోమారు తేటతెల్లమైంది. అట్టడుగున ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే నాటి నుంచి నేటి వరకు కార్పొరేట్ విద్యకు నోచుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే సంకల్పంతో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి, ఆంగ్ల బోధనను అమలు చేయడం ప్రశంసనీయం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుండడం హర్షణీయం.
– బట్టు సాంబయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక వరంగల్ జిల్లా కార్యదర్శి
మంగపేట, ఏప్రిల్15 : విశ్వమానవుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అద్భుతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమెప్పుడూ భారతదేశం గర్వించేలా ఉంటుంది. దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా సంస్కరణలు చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయమైంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటే గాక, సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టి, అంబేద్కర్ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున అవార్డు ఇవ్వడానికి రూ.50కోట్ల నిధి ఏర్పాటుకు హామీ ఇవ్వడం హర్షణీయం.
– పరికి శ్రీనివాస్, ఏజెన్సీ దళిత సేవా సంఘం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కమలాపురం, మంగపేట
వర్ధన్నపేట, ఏప్రిల్ 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు ఎంతో గౌరవం పెరిగింది. దళిత కుటుంబాలకు చేయూతనిచ్చేలా దళిత బంధు పథకంతో నిరుపేదలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు. ఒకరివద్ద పనిచేసి పేదరికంలో మగ్గే పేదలు నేడు దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిపొంది వ్యాపా రాలు చేయడం, సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకొని గౌరవంగా జీవిస్తు న్నారు. అంతేకాక బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయడం దళితవర్గాలకు గర్వకారణం. సంక్షేమ పథకాల్లో కూడా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
– హన్మకొండ సుధాకర్, రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి
పెద్దవంగర, ఏప్రిల్ 15 : ప్రపంచంలో ఎకడా లేని కులమత అసమానతలు వేళ్లూనుకున్న భారతావనిలో జన్మించిన బాబా సాహెబ్ అంబేదర్ను బాల్యంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. బడికి, గుడికి దూరం చేసిన నాటి సమాజంపై ఏనాడు ద్వేషం పెంచుకోలేదు. అలాగని ఊరికే ఉండలేదు. అసమానతలకు మూలాలను వెతికి పట్టాడు. చిన్నప్పటి నుంచే పట్టుదలతో పెద్దపెద్ద చదువులు చదివి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. అహోరాత్రులు శ్రమించి, అందరి హక్కులను కాపాడేలా అఖండ భారత దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడు. తన ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ప్రకారమే తెలంగాణ కల సాకారమైందనే సత్యాన్ని గ్రహించిన నాటి ఉద్యమ నేత కేసీఆర్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కృతజ్ఞతా పూర్వకంగా 125 అడుగుల ఎత్తుతో తెలంగాణలో అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు. భారతీయులందరూ దీనిని స్వాగతించాల్సిందే. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న దళితబంధు దళితల జీవితాల్లో వెలుగు నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి, నిమ్న జాతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే అంబేదర్కు నిజమైన నివాళి.
-డాక్టర్ చిలుక భాసర్, మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర, ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు, తెలుగు భాషా బోధకులు
హనుమకొండ, ఏప్రిల్ 15 : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించడం గొప్ప విషయం. ఇదొక చారిత్రకమైన రోజు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహాసంకల్పానికి నిదర్శనం. అంతపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అలాగే సెక్రటరియేట్ (సచివాలయం)కు కూడా అంబేద్కర్ పేరు పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంబేద్కర్ భారత జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో సమున్నతమైన స్థానంలో నిలిపిన మహోన్నత వ్యక్తి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏర్పాటు యోచన, భారీ ప్రాజెక్టు నిర్మాణాలు , రవాణా రంగంలో ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టడం అంబేద్కర్ కృషి అనే చెప్పాలి. ఇక ముందు శతాబ్దంలో కూడా అంబేద్కర్ సిద్ధాంతాలే భారత్ పురోగమనానికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.
– ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపాల్
పాలకుర్తి, ఏప్రిల్ 15 : బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున, సాగర తీరాన ఆవిష్కరించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారు. మాటలు చెప్పేవారు చాలామంది ఉంటారు.. కానీ, చేతల్లో చూపించే వారు కొందరే ఉంటారు. వారిలో సీఎం కేసీఆర్ ముందువరులో ఉంటారు. భారతావనికి దిశను చూపిన మహనీయుడి అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తన దార్శనికతతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిన అంబేద్కర్ భావితరాలకు గుర్తుండేలా 125 అడుగుల మహావిగ్రహాన్ని ఏర్పాటు చేసి, గల్లీ నుంచి హస్తిన వరకు ప్రతిఒక్కరూ గర్వంగా చెప్పుకొనేలా చేశారు.
– జిలుకర వెంకన్న, కవి రచయిత మల్లంపెల్లి, పాలకుర్తి మండలం
భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 15 : అన్ని రాష్ర్టాల పాలకులు సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను గుర్తు చేసుకోలేని సోయిలో ప్రభుత్వాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగిన విషయం. సీఎం కేసీఆర్‌ను అన్ని రాష్ర్టాల పాలకులు ఆదర్శంగా తీసుకుని వారి రాష్ర్టాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాష్ర్టాల్లో అమలు చేయాలి. ఇదే వారు దళితులకు ఇచ్చే గౌరవం. తూతూ మంత్రంగా జయంతిలు నిర్వహించడం కాదు. ఆచరణలో చూపించాలి. దళితుల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయాలి.
-సొత్కు ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 15 : సీఎం కేసీఆర్ మహా సంకల్పంతో హైదరాబాద్ మహానగరంలో బాబా సాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం హర్షించదగిన విషయం. రాజ్యాంగ నిర్మాతకు దక్కిన సమున్నతమైన గౌరవం ఇది. గత పాలకులెవరికీ ఇంత మంచి ఆలోచన రాలె. మన ముఖ్యమంత్రి అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అనుసరించడం అభినందనీయం. విగ్రహ ఏర్పాటుతో సమాజంలో దళిత వర్గానికి మరింత గౌరవం పెరిగింది. దేశాన్ని పాలిస్త్తున్న బీజేపీ దళితుల కోసం ఒక్క మంచి పని చేయలె. పైగా మతద్వేషాలు, ఘర్షణవాతావరణం సృష్టించి ప్రజలను ఆగం చేస్తున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలు కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. దళితులకు న్యాయం చేసే విధానాలను అమలు చేయాలి. గత పాలకులు దళిత సమాజాన్ని పట్టించుకోలె. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారికి సముచిత స్థానం కల్పిచిండు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా అండగా ఉంటున్నడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా దళితబంధును అమలు చేయాలి.
– దుడ్డెల రామ్మూర్తి, దళిత సామాజిక ఉద్యమ నాయకుడు
నర్సంపేట, ఏప్రిల్15 : బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరు. మేధావుల దినోత్సవం కూడా ఈయన జయంతి రోజునే ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆ మహనీయుడికి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో అభినందనీయం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల నిరుపేదలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కనుక దళితులు, ఆదివాసీలు, గిరిజనులు బడుగు బలహీన వర్గాలు, అగ్రకుల పీడిత వర్గాలు ఆ దిశగా ఉద్యమించాలి. అప్పుడే అంబేద్కర్ కల నెరవేరుతుంది.
– ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు,దళితరత్న కల్లెపెల్లి ప్రణయదీప్మాదిగ