జనగామ/ములుగు(నమస్తే తెలంగాణ)/నర్సింహులపేట/భూపాలపల్లి టౌన్, మార్చి 15 : వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసిస్టెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా జరుగుతున్న సమయంలో విధులకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. దీంతో రెండేళ్లుగా పనులకు దూరంగా ఉంటున్నారు. నెలనెలా వేతనాలందక, ఇతర పనులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. వారిని విధుల్లోకి తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో మహబూబాబాద్ జిల్లాలో 247మంది, హనుమకొండలో 208, జనగామలో 181మంది, జయశంకర్ భూపాలపల్లిలో 140, ములుగు 123మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సంబురాలు మిన్నంటాయి. మంగళవారం సాయం త్రం కేసముద్రం మండలకేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే జనగామ చౌరస్తా, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూ ర్లో ఫీల్డ్ అసిస్టెంట్లు స్వీట్లు పంచుకొని పటాకలు కాల్చి పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు లావు బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాకన్న, అనిత, వీరన్న, రాజేష్, ఎల్లయ్య, స్వామి, సారయ్య, మ హేందర్, రామకృష్ణ, లచ్చిరాం, యాదగిరి, నాగరాజు, అజయ్, రా మచంద్రయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తాం. సబ్బండ వర్గాలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ మా ఆవేదనను అర్థం చేసుకొని తిరిగి ఉద్యోగాలను కొనసాగించడం శుభపరిణామం. ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, ప్రజాప్రతినిధులకు తాము రుణపడి ఉంటాం.
– లావు బాల్‌రెడ్డి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, జనగామ
రెండేళ్ల నుంచి పనులు లేక మానసికంగా ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకొని మా జీవితాల్లో వెలుగు నింపారు. మా బాధలను అర్థం చేసుకున్న మంచి మనస్సున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. గ్రామాల్లో ఉపాధి పనులు ఇకపై ముమ్మరంగా కొనసాగించేందుకు మా వంతుగా పనిచేస్తాం. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
– రాగిపెల్లి యాకన్న, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, జనగామ
రెండేళ్లగా ఉపాధి పనులకు దూ రంగా ఉన్నం. వేతనాలు లేక, కుటుంబాలు గడవ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మరోసారి మాకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు. మళ్లీ వీధుల్లోకి తీసుకుంటారని అనుకోలేదు. అసెంబ్లీలో సీఎం ప్రకటించిన తర్వాత సంతోషంగా ఉంది.
– భూక్యా వీరన్న, పడమటిగూడెం, మహబూబాబాద్
రెండేళ్లుగా పనులు లేక, వేతనాలందక కుటుంబాలను పోషించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాం. ఉద్యోగం లేక ఆర్థికంగా తీవ్రఇబ్బందులు పడుతున్న మాకు సీఎం కేసీఆర్ సార్ అండగా నిలిచారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి ధైర్యం ఇచ్చారు. ఫీల్డ్‌అసిస్టెంట్ల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– చలమల్ల వీరన్న, పడమటిగూడెం, మహబూబాబాద్