పోచమ్మమైదాన్, మే 25: బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని తోట మైదానంలో గురువారం రాత్రి చేనేత కార్మికులకు బీమా బాండ్లను పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు నేత కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వారికి తగిన నిధులు కేటాయించకుండా, రాయితీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు.
పరిశ్రమలను మూసివేస్తూ, సంఘాల నుంచి ఖరీదులు చేయకుండా కార్మికులను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. కానీ, బీఆర్ఎస్ సర్కారు నేతృత్వంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పద్మశాలీలకు సముచితస్థానం కల్పిస్తూ.. వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ఇందులో భాగంగా నేతన్నల కోసం ప్రభుత్వం ప్రత్యేక చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని వివరించారు. అలాగే, కార్మికులకు నూలు, రసాయనాలు, రంగుల్లో రాయితీలు ఇస్తూ నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నదని వెల్లడించారు. సంఘాల్లో ఉన్న రూ. 10 కోట్ల విలువైన స్టాక్‌ను కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు.
మిగిలిన స్టాక్‌ను కొనుగోలు చేసేలా అధికారులతో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా చేనేత సంఘాల్లోని ఉత్పత్తులను మూడు నెలలకోసారి కొనుగోలు చేసి, బకాయిలు చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. తన చిన్ననాటి నుంచి కొత్తవాడ అంటే ఎంతో ప్రేమ అని, తాను ఎక్కువగా ఇక్కడే తిరిగేవాడినని గుర్తుచేశారు. చేనేతపై ఆధారపడిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటూ, కార్మికులను కాపాడుకుంటామన్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు కార్మికులందరికీ చేనేత బీమా అందించే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన కార్మికులందరికీ చేనేత బీమా బాండ్లను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బాల్నె సురేశ్, గోరంటల మనోహర్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు ఆడెపు రవీందర్, గోరంటల రాజు, పలు సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.