Bayyaram Bricks | మహబూబాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : బయ్యారం అంటే ఇనుప రాతి గుట్టలే గుర్తొస్తాయి. ఇక్కడ ఇవే కాదు ఇంకా ఎన్నో వ్యాపారాలకు బయ్యారం వేదిక అన్నది చాలామందికి తెలియదు. ఒకప్పుడు పెంకుకు పెట్టిన కోట ఇది. మట్టి, గూన పెంకలతో పాటు బెంగళూరు గూన పెంకలు ఇక్కడ తయారు చేసేవారు. ఇక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రం నలుమూలలకు ఎగుమతి చేసేవారు. రాను రాను వీటి ప్రాధాన్యం తగ్గిపోవడంతో పెంకు పరిశ్రమ మూలన పడింది. ఇప్పుడు తాజాగా బయ్యారంలో తయారయ్యే ఇటుకలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ తయారు చేసే ఇటుకను హైదరాబాద్, కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి మట్టి ఎంతో నాణ్యత కలిగి ఉండడమే. బయ్యారం మండలం నామాలపాడు, కొత్తపేట ప్రాంతాల్లో నలభై ఇటుక బట్టీలు ఉన్నాయి.
ఈ బట్టీలలో ఇటుక తయారీకి వాడే మట్టిని బయ్యారం పెద్ద చెరువు నుంచి తీసుకొస్తారు. ఈ మట్టి ఎంతో నాణ్యత కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటుక తయారు చేసే సంవత్సరం ముందు మట్టిని నిల్వ చేస్తారు. నిల్వ చేసిన మట్టిని కుండీల్లో నాణబోస్తారు. రెండు రోజుల తర్వాత నాణబెట్టిన మట్టిలో ైప్లెవాక్స్ యాష్, ఉనకతో మిక్సింగ్ చేస్తారు. అనంతరం ఇటుకలను కట్ చేసి బట్టిలో వేసి సుమారుగా 8 నుంచి 10 రోజుల వరకు కాలుస్తారు. చల్లారిన తర్వాత వచ్చిన ఇటుకను నిర్వాహకులు అమ్మేస్తారు. బయ్యారం ఇటుక బరువు తక్కువతో పాటు తొమ్మిది ఇంచుల పొడవు, నాలుగు ఇంచుల వెడల్పు, మూడు ఇంచుల మందం కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించే కాంట్రాక్టర్లు, బిల్డర్లు బయ్యారంలో తయారయ్యే ఇటుకను ఎక్కువగా వినియోగిస్తున్నారు. బయ్యారం ఇటుక ఎంతో నాణ్యత కలిగి ఉండడంతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి వ్యాపారులు ఇటుకను తీసుకెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
నాణ్యతతో ఇటుక
బయ్యారంలో తయారయ్యే ఇటుక ఎంతో నాణ్యత కలిగి ఉంటుంది. ఒక ఇటుకకు రూ.4 నుంచి రూ.4.50లు ఉంటుంది. ఇటుకను కొనుగోలు చేసి తీసుకెళ్లే వారే రవాణా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఇక్కడి ఇటుకను హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాలకు రవాణా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇటుక బట్టీల్లో కనీసం 10వేల మంది కార్మికులు నిత్యం పని చేస్తున్నారు. ఒడిశాకు చెందిన కూలీలతో పాటు లోకల్‌గా మరికొంత మంది కూలీలు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఇటుక బట్టి వారు అనుమతి కోసం ఏటా రూ.10వేలు గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో చెల్లించాలి. అదేవిధంగా నిత్యం పదివేల మంది కార్మికులతో కిటకిటలాడే నామాలపాడు, కొత్తపేట ప్రాంతాల్లో పలు వ్యాపారాలు వెలిశాయి. కొత్తపేటలో ప్రతి ఆదివారం జరిగే కూరగాయల అంగడి కార్మికులతో కిటకిటలాడుతుంది. అంతే కాకుండా కిరాణం, లాండ్రీ, సెలూన్లు, చికెన్, మటన్ షాపులతో పాటు అన్ని షాపులు వెలిశాయి. ఇక్కడ పని చేసే ఒడిశా కూలీలు అంగడి జరిగినప్పుడు వారానికి సరిపడా సరుకులు తీసుకెళ్తారు.
ఇక్కడి ఇటుకతో ఇల్లు కట్టుకున్నా
మాది ఇర్సులాపురం గ్రామం. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్తపేటలో ఉన్న బట్టీ నుంచి ఇటుక కొనుగోలు చేసి తెచ్చాను. 2006లో ఇల్లు కట్టిన. ఇప్పటికీ మా ఇంటి గోడలు చెక్కు చెదరలేదు. బయ్యారం మండలం నామాలపాడు, కొత్తపేటలో తయారయ్యే ఇటుక నాణ్యతగా ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రవాణా చేస్తుంటారు. బయ్యారం పెద్ద చెరువులో ఉన్న మట్టితో ఇటుకలు తయారు చేయడం వల్ల నాణ్యత ఉంటుంది. అందుకే ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
– సింగ సురేశ్, ఇర్సులాపురం, బయ్యారం
ఇతర జిల్లాలకు ఎగుమతి అవుతుంది..
మేము తయారు చేసే ఇటుకకు బయ్యారం పెద్దచెరువులోని మట్టిని వాడుతాం. ఈ మట్టి ఎంతో నాణ్యతగా ఉంటుంది. మట్టి నాణ్యతగా ఉంటేనే ఇటుక నాణ్యతగా తయారువుతుంది. నామాలపాడు, కొత్తపేటల్లో 40 ఇటుక బట్టీలు ఉన్నాయి. రోజుకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు 50వేల నుంచి లక్ష దాకా ఇటుక రవాణా అవుతుంది. ఇది కాకుండా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఎక్కువగా రవాణా చేస్తున్నాం. కరీంనగర్ ఇటుక తర్వాత రాష్ట్రంలో అంత నాణ్యత కలిగిన ఇటుక బయ్యారంలోనే దొరుకుతుంది. ఇళ్లు నిర్మించే కాంట్రాక్లర్లు, బిల్డర్లు ఎక్కువగా బయ్యారంలో తయారు చేసే ఇటుకను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మా బట్టీలో తయారయ్యే ఇటుక లైట్ వెయిట్‌తో పాటు గట్టిగా ఉంటుంది. ఎంతపై నుంచి కింద పడేసినా ఇటుక విరగదు.
– భూతం వెంకన్న, ఇటుక బట్టి వ్యాపారి, కొత్తపేట