దామెర, జనవరి 27: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగులాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన గుత్తికొండ కౌశిక్(11) క్లాస్‌లీడర్‌గా ఉన్నాడు.
గుట్కాలు, సిగరెట్లు తాగుతున్నామంటూ తమపై ప్రిన్సిపాల్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నావంటూ కౌశిక్‌ను కొంతమంది విద్యార్థులు వారం రోజుల క్రితం చితకబాదారు. ఆదివారం గణతంత్ర వేడుకలు ముగిసిన తరువా త మరోసారి అతడిపై దాడి చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న కౌశిక్ ను చికిత్స కోసం ఉపాధ్యాయులు గుట్టుచప్పుడు కాకుండా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై వివరణ కోసం ప్రిన్సిపాల్ సమ్మయ్యను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.