హనుమకొండ, జూన్ 15 : సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరుగనుంది. ఉదయం పరీక్షకు 9 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 2 గంటల నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 11 సెంటర్లలో 4,730 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్స్, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు ఆ ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని సంబందిత శాఖల అధికారులను ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, హనుమకొండ కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ బ్లాక్ – ఏ, బీ, ఇంజినీరింగ్ బ్లాక్ (సెవన్ హిల్స్ దవాఖాన దగ్గర), వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ బాలికల కళాశాల, పెద్దపెండ్యాల వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, సుబేదారిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సబ్ సెంటర్-ఏ, బీ, హంటర్‌రోడ్డులోని న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీ, మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, హనుమకొండ అడ్వకేట్స్ కాలనీ రోడ్డు నంబర్-1లోని ఎస్ఆర్ నేషనల్ హైస్కూల్స్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సుబేదారి : సివిల్స్ పరీక్ష సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇన్చార్జి సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి సాయం త్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి సీపీ హెచ్చరించారు.