గణపురం, సెప్టెంబర్ 8 : అక్రమంగా నిల్వ చేసిన 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అయితే సివిల్ సప్లయ్ సంచులతోనే అవి పట్టుబడడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి సమీపంలోని కొత్తపల్లిలో ఇద్దరి ఇళ్లలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో స్థానిక ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఒక ఇంట్లో రూ.4,86,330 విలులైన 124.70 క్వింటాళ్లు, అలాగే అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన రూ. 1.84 లక్షల విలువైన 47.40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ మేరకు పీడీఎస్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేస్తున్న తూర్పాటి శంకర్, పస్తం సారయ్యను అదుపులోకి తీసుకొని కేసు నమోదు వేసినట్లు ఎస్సై తెలిపారు. స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పజెప్పినట్లు చెప్పారు.
నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్న ఆక్రమంగా అమ్ముకుంటున్న డీలర్ల బాగోతం బయటపడింది. ఆదివారం మండల కేంద్రం శివారు కొత్తపల్లిలో పోలీసుల జరిపిన దాడుల్లో సివిల్ సప్లయ్ నుంచి సరఫరా అయి సీలు తీయని 356 బియ్యం సంచులు లభ్యమవ్వడంతో పోలీసులు, అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. సంచులపై ఉన్న వివరాల ఆధారంగా డీలర్లు ఎవరనేది తెలుసుకోనున్నట్లు పోలీసు, రెవెన్యూ అధికారులు తెలిపారు.