పౌర సరఫరాల శాఖలోని కొందరు అధికారుల సహకారంతో పలువురు రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను డెలివరీ చేయడం లేదు. అయినా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ఏటా వానకాలం, యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం సీఎంఆర్ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తున్నది.
మిల్లుల నిర్వాహకులు నూర్పిడి చేసి నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది. గత వానకాలం ధాన్యం పొందిన రైస్ మిల్లర్లు ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. మరి కొద్దిరోజుల్లో ఈ డెడ్‌లైన్ ముగిసిపోనుండగా జిల్లాలో కొందరు మిల్లర్లు ఇప్పటి వరకు సీఎంఆర్ డెలివరీ చేయడం మొదలు పెట్టలేదు. డెలివరీ శాతం జీరో ఉన్న రైస్ మిల్లుల్లో ప్రభుత్వం కేటాయించిన గత వానకాలం ధాన్యం నిల్వలు అసలు ఉన్నాయా? లేవా? అనేది చర్చనీయాంశంగా మారింది.
– వరంగల్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
వరంగల్ జిల్లాలో గత ఏడాది (2023-24) రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన 56,967 టన్నుల వానకాలం ధాన్యాన్ని వంద రైస్ మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించింది. మిల్లుల నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసి ప్రభుత్వానికి 38,255 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెలాఖరు వరకు ముగుస్తున్నప్పటికీ సోమవారం వరకు టార్గెట్‌లో 75 శాతం అంటే 28,729 టన్నుల సీఎంఆర్ మాత్రమే డెలివరీ చేశారు. ఇంకా 9,491 టన్నుల సీఎంఆర్‌ను రైస్ మిల్లర్లు డెలివరీ చేయాల్సి ఉంది.
గత వానకాలం ధాన్యం పొందిన కొన్ని రైస్ మిల్లుల నిర్వాహకులు ఇంకా సీఎంఆర్ డెలివరీ చేయడం ప్రారంభించలేదు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని సౌభాగ్య ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్‌మిల్లు నిర్వాహకులు పొంది న 799 టన్నుల ధాన్యం ద్వారా 535.080 టన్నులు, నెక్కొండ మండలం చంద్రుగొండలోని శ్రీవెంకటేశ్వర మోడ్రన్ రైస్‌మిల్ నిర్వాహకులు పొందిన 899.68 టన్నుల ధాన్యానికి 602.786 టన్నులు, సంగెం మండలం కాపులకనపర్తిలోని సతీశ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్ 418 టన్నులకు 280.435 టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాల్సి ఉంది.
ఈ నెలాఖరుతో గడువు ముగుస్తున్నా వీరు ఒక్క టన్ను కూడా సీఎంఆర్ డెలివరీ చేయలేదు. జీరో శాతం డెలివరీ ఉన్న ఈ మిల్లర్లపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. విచిత్రమేమిటంటే సతీశ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు నిర్వాహకులు 2022-23 యాసంగి ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బకాయి ఉన్నారని నాలుగు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఇందులో సదరు ధాన్యం లేదని గుర్తించి యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు. దీంతో గత వానకాలం ధాన్యం సీఎంఆర్‌ను ఈ రైస్ మిల్లు నుంచి డెలివరీ చేసే అవకాశం లేదని తెలుస్తున్నది.
గత వానకాలం ధాన్యం పొందిన రైస్‌మిల్లుల్లో చంద్రుగొండలోని మల్లికార్జునస్వామి ఇండస్ట్రీస్ రైస్ మిల్లు కేవలం 6.20 శాతం, సంగెం మండలం తీగరాజుపల్లిలోని కేఎన్ఆర్ మిల్లు టెక్ రైస్ మిల్లు 16.36 శాతం సీఎంఆర్ మాత్రమే సోమవారం వరకు డెలివరీ చేశాయి. గీసుగొండ మండలం విశ్వనాథపురంలోని మారుతి మిల్ టెక్ రైస్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు 19.17, కొనాయమాకులలోని న్యూసహార ఇండస్ట్రీస్ మిల్లు వారు 15.63, కొమ్మాలలోని శ్రీవెంకటేశ్వర బీఆర్ మిల్లు 22.04 శాతం సీఎంఆర్ డెలివరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
గడువు సమీపించిన నేపథ్యంలో అధికారులు సీఎంఆర్ డెలివరీ మొదలుపెట్టని, కొద్ది శాతం డెలివరీ చేసిన రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొందరు రైస్ మిల్లర్లు స్పందిస్తుండగా మరికొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిసింది. ఈ పరిస్థితికి జిల్లాలోని పౌర సరఫరాల శాఖ, సంస్థ ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం, క్షేత్రస్థాయి అధికారుల తీరు కారణమని సమాచారం. జీరో ఉన్న మిల్లర్లకు ఈ నెలాఖరులోగా డెలివరీ చేయాలని చెప్పినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.